Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతుల పట్టుదలకు వందనాలు..

‘సాగు చట్టాల రద్దు’ ప్రకటనను స్వాగతించిన సినీ ప్రముఖులు

న్యూదిల్లీ : మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన రైతుల పట్టుదలకు వందనాలు అని అనేక మంది సినీ ప్రముఖులు కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని సోనూ సూద్‌, ఊర్మిలా మంటోడ్కర్‌, తాప్సీ పన్ను, రిచా చద్దా సహా అనేక మంది సినీ ప్రముఖులు స్వాగతించారు. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే, ప్రభుత్వ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతుల పట్టుదలను ప్రశంసించారు. నటుడు సోనూ సూద్‌ ఈ వార్తను అద్భుతంగా అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు రైతులకే కాకుండా మోదీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది అద్భుతమైన వార్త. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు. శాంతియుత నిరసనల ద్వారా న్యాయమైన డిమాండ్లను లేవనెత్తినందుకు రైతులకు ధన్యవాదాలు. ఈ రోజు గురునానక్‌ దేవ్‌ జీ ప్రకాష్‌ పురబ్‌ సందర్భంగా మీరు మీ కుటుంబాలతో సంతోషంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను’ అని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిలా మంటోడ్కర్‌ రైతుల ఫొటోను పంచుకుంటూ, ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘విజయానికి ఉత్సాహం అవసరం. మరిగే రక్తం ఎవరికి కావాలి. ఈ ఆకాశం కూడా నేలపైకి వస్తుంది. విజయానికి ప్రతిధ్వనించే ఉద్దేశాలు మాత్రమే అవసరం. కిసాన్‌ ఆందోళన్‌ జిందాబాద్‌. నా రైతు సోదరసోదరీమణులకు సంతోషం. అమరవీరులైన రైతులకు వందనాలు’ అని పేర్కొంది. సంస్కరణలు తీసుకురావడానికి భాగస్వామ్యులందరితో చర్చించడం భవిష్యత్‌ ప్రభుత్వాలకు గుణపాఠమని నటి గుల్‌ పనాగ్‌ అన్నారు. ‘మనం ప్రతిష్ఠంభనను ఇంతకాలం ఉండనివ్వకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. భవిష్యత్తు ప్రభుత్వాలు సంస్కరణలను తీసుకురావడానికి భాగస్వామ్యులందరితో మార్గాలను, సంకల్పాన్ని కనుగొనడానికి ఇది ఒక పాఠంగా ఉండనివ్వండి. చట్ట రూపకర్తలకు ఒక పాఠం కూడా. చర్చలు లేకుండా నిమిషాల్లో చట్టాలను ఆమోదించడం ద్వారా శాసన ప్రక్రియను తప్పించుకోలేం’ అని వివరించారు. చద్దా, ప్రియాంక చోప్రా జోనాస్‌, సోనమ్‌ కపూర్‌ అహుజా, ప్రీతి జింటా, స్వరా భాస్కర్‌, దిల్జిత్‌ దోసాంజ్‌, రీతేష్‌ దేశ్‌ముఖ్‌, దర్శకుడు హన్సల్‌ మెహతా, హర్భజన్‌ మాన్‌, జస్బీర్‌ జస్సీ వంటి అనేక మంది కళాకారులు సామాజిక మాధ్యమాల ద్వారా రైతు ఉద్యమానికి గతంలో తమ మద్దతును అందించారు. పంజాబీ గాయకులు, నటులు మన్‌, కన్వర్‌ గ్రేవాల్‌, హర్ఫ్‌ చీమా, బబ్బు మాన్‌, జాస్‌ బజ్వా, హిమ్మత్‌ సందు, ఆర్‌ నైత్‌, అన్మోల్‌ గగన్‌లతో సహా అనేక మంది రైతుల పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ పాటలను స్వరపరిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img