Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఈ నల్లటోడు తప్పుడు వాగ్ధానాలు చేయడు

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌పై కేజ్రీవాల్‌ విసుర్లు
చండీగఢ్‌ : ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీపై విమర్శలు గుప్పించారు. చన్నీ బుధవారం ఆప్‌ పార్టీని 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నిస్తున్న ‘కాలే ఆంగ్రేజ్‌’ (నల్ల బ్రిటీష్‌) పార్టీ అని ఎద్దేవా చేశారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ దుస్తులు ధరించి, నల్లగా ఉన్న వ్యక్తి అన్ని హామీలను నెరవేరుస్తాడని నేను వారికి (కాంగ్రెస్‌) చెప్పాలనుకుంటున్నాను. నేను తప్పుడు ప్రకటనలు లేదా తప్పుడు వాగ్ధానాలు చేయను’ అన్నారు. గురువారం ఆయన పఠాన్‌కోటలో ఆప్‌ తలపెట్టిన తిరంగ యాత్రలో పాల్గొనడానికి వెళుతూ విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఆప్‌ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1000 ఇస్తామన్న తనను పంజాబ్‌ ముఖ్యమంత్రి హేళన చేశారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘నేను చన్నీ సాహెబ్‌ని చాలా గౌరవిస్తాను. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామని ప్రకటించినప్పటి నుంచి నాపై దాడి చేస్తూనే ఉన్నారు.. కొన్ని రోజుల క్రితం, ఆయన సాధారణ బట్టలు వేసుకున్నందుకు నన్ను అవహేళన చేశారు.. అయితే దీంతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదని నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ‘నిన్న అతను (చన్నీ) నన్ను ‘కాలా’ (నల్లటివాడు) అని చెప్పాడు. నా రంగు ముదురు అని నేను అంగీకరిస్తున్నాను. నేను ప్రతి గ్రామంలో పర్యటిస్తాను. ప్రకాశవంతమైన ఎండలో ఉన్నప్పుడు, నా చర్మం పదునెక్కింది. అతనిలా, నేను హెలికాప్టర్లలో పర్యటించను నా తల్లులు, సోదరీమణులు ఈ ‘కాలా భాయ్‌’ (నల్లటి ఛాయ గల సోదరుడు)ని ఇష్టపడతారు. నా ఉద్దేశం స్పష్టంగా ఉందని అందరికీ తెలుసు, ఎవరి ఉద్దేశం చెడ్డదో అందరికీ తెలుసు’ అని కేజ్రీవాల్‌ అన్నారు. 2022 ఆరంభంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ మధ్య విమర్శల యుద్ధం నడుమ పంజాబ్‌లోని మోగా జిల్లా బాద్నీ కలాన్‌లో జరిగిన సభలో చన్నీ మాట్లాడుతూ ‘కాలే అంగ్రేజ్‌’ వ్యాఖ్యను పునరుద్ఘాటించారు. ఆప్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘చిట్టే అంగ్రేజ్‌’ (బ్రిటీష్‌)ని దేశం నుంచి తరిమికొట్టిన తర్వాత ఈ ‘కాలే ఆంగ్రేజ్‌’ పంజాబ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చన్నీ అన్నారు.
పంజాబ్‌లో విజయం ‘ఆప్‌’దే : చద్దా
అరవింద్‌ కేజ్రీవాల్‌పై పంజాబ్‌ ప్రజలకు నమ్మకం ఉందని, వారు దిల్లీ నమూనా పాలనను కోరుకుంటున్నారని ఆప్‌ నాయకుడు రాఘవ్‌ చద్దా తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమాను వ్యక్తపరిచారు. సరైన సమయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటిస్తారని చద్దా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img