Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాసు ‘హ్యాట్రిక్‌’

‘ఓవరాల్‌’ ర్యాంకింగ్స్‌లో ఐఐఎస్‌సీ బెంగళూరుకు రెండవ స్థానం
వైద్య కళాశాలల్లో ‘ఎయిమ్స్‌ దిల్లీ’నే టాప్‌
న్యూదిల్లీ :
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాసు(ఐఐటీ మద్రాసు) వరుసగా మూడవసారి కూడా దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా నిలిచింది. 2021 నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌ 2021 ‘ఓవరాల్‌’, ఇంజనీరింగ్‌’లో అగ్రస్థానాన్ని అధిష్టించింది. ఈ జాబితాలో ఐఐటీలు మరోసారి భారీ స్కోరు సాధించాయి. మొత్తం ఏడు ఐఐటీలు స్థానం సంపాదించాయి. అలాగే దేశంలోని ఉత్తమ విద్యా సంస్థలలో ఒకటిగా ఐఐఎస్‌సీ బెంగళూరు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ఇక అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల జాబితాలో ఐఐటీ బాంబే మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లు వరుసగా నాలుగు, ఐదు, ఆరవ స్థానాలలో నిలిచాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు 9, 10వ ర్యాంకులను దక్కించుకున్నాయి. మరోవైపు, వైద్య కళాశాలల విషయానికొస్తే, ఎయిమ్స్‌ దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాలలో పీజీఐఎంఈఆర్‌ చండీగడ్‌, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌, వేలూరు ఉన్నాయి. ఉత్తమ బి`స్కూల్‌గా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) అహ్మదాబాద్‌ నిలిచింది. అయితే ఫార్మసీ విద్యకు సంబంధించి జామియా హమ్‌దర్ద్‌ ఉత్తమ విద్యా సంస్థగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కళాశాలల విభాగంలో దిల్లీలోని మిరాండా హౌస్‌ తొలి ర్యాంక్‌ సాధించగా, తర్వాత స్థానాలలో దిల్లీకి చెందిన మహిళా కళాశాల లేడీ శ్రీరామ్‌ కళాశాల, చెన్నైకు చెందిన లయోలా కళాశాల నిలిచాయి. కాగా ప్రమాణాలకు సంబంధించి ఐదు విస్తృత సాధారణ గ్రూపులపై సంస్థలను ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ అంచనా వేస్తుంది. ఇందులో బోధన, అభ్యాసం, వనరులు(టీఎల్‌ఆర్‌), పరిశోధన, వృత్తి శిక్షణ(ఆర్‌పీ), గ్రాడ్యుయేషన్‌ ఫలితాలు(జీవో), విస్తరణ, చేరిక(ఓఐ), అవగాహన(పీఆర్‌) ఉన్నాయి. ప్రమాణాలకు సంబంధించి ఈ ఐదు విస్తృత సాధారణ గ్రూపులు ఒక్కొక్క దానికి కేటాయించిన మొత్తం మార్కుల ఆధారంగా ర్యాంకులు ఉంటాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ 2015లో ప్రారంభం కాగా 2016లో మొదటిసారిగా ర్యాంకులను ప్రకటించింది. మొదటి ర్యాంకుల నాటి నుంచి విభాగాల సంఖ్య నాలుగు నుంచి 11కు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img