Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పార్లమెంటులో రచ్చ రచ్చే : తృణమూల్‌

కోల్‌కతా : పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ సోమవారం సూచనప్రాయంగా తెలిపింది. భారతదేశాన్ని నిరంకుశ పాలన వైపు వెళ్లకుండా నియంత్రించడానికి ప్రతిపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయని స్పష్టంచేసింది. మోదీ సర్కారు అత్యంత నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 నుంచి డిసెంబరు 23 వరకు జరపడానికి పార్లమెంటు వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసిన విషయం విదితమే. ‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కేవలం రెండు వారాల ముందు ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. సీబీఐ, ఈడీ పంజరంలో చిలుకల్లా మారాయని సుప్రీంకోర్టు ఇప్పటికే అనేకసార్లు ఆక్షేపించింది. ఇప్పటివరకు రెండేళ్లు మాత్రమే అవి పంజరంలో చిలుకల్లా ఉండేవి. ఇక నుంచి ఐదేళ్లు అలా ఉండాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వాన్ని నియంతృత్వం వైపు మారకుండా ప్రతిపక్షాలు అన్ని విధాలా ప్రయత్నిస్తాయి’ అని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం ఐదేళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల అంశాన్ని తమ పార్టీ కచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతుందని ఆయన ప్రకటించారు. ద్రవ్యోల్బణం, రైతు ఉద్యమం, బీఎస్‌ఎఫ్‌ పరిధిని పెంచడం వంటి అంశాలపైనా మోదీ సర్కారును నిలదీస్తామని స్పష్టంచేశారు.
త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండగా ఆ రెండు ఆర్డినెన్స్‌లను కేంద్రం ఎందుకు తీసుకొచ్చిందో నిలదీస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ చెప్పారు. వచ్చేవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అలాంటప్పుడు హడావుడిగా ఆర్డినెన్స్‌లు తీసుకురావాల్సిన అవసరం లేదు. దీనిపై పార్లమెంటులో చర్చిస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తామని బందోపాధ్యాయ పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. పెగాసస్‌ వివాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, చర్చకు పట్టుబడతామని, ప్రభ్వుం సైతం దీనిపై చర్చను అడ్డుకోకపోవచ్చని మరో తృణమూల్‌ నేత అన్నారు. మమత బెనర్జీతో సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img