Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజులు లేరు`రాజదండం ఎందుకు?

డాక్టర్‌ సీఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి
9059837847

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇదే తరుణంలో మోదీ పాలన తీరుపై విసిగి వేసారిన కన్నడ ప్రజలు అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ ప్రజలకు దారిదీపంగా మారుతున్న క్రమంలో దాని నుంచి సమాజం దృష్టి మరల్చడం పాలకులకు పెద్ద తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. ఈ తరుణంలోనే ప్రజలను భావోద్వేగాల్లో ముంచి తేల్చడంలో ఆరితేరిన నేతలకు పార్లమెంటు ప్రారంభోత్సవం, అందులో ‘రాజదండం’ ప్రతిష్ఠాపన అనే అంశం ఊతకర్రగా మారింది.
సెంగోల్‌గా పిలిచే రాజదండాన్ని పార్లమెంటు నూతన భవనంలోని లోకసభలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్ర మంత్రులు చేసిన ప్రకటన దేశంలో చర్చగా మారింది. ఈ అంశానికి సంబంధించి, ఆ రాజదండం పుట్టుపూర్వోత్తరాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అసత్యాలు, అర్థ సత్యాలే అధికం. ఆ రాజదండం కథ కమామిషులోకి వెళితే భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటీష్‌ అధికారి లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ నుంచి భారత తొలి ప్రధాని ఈ రాజదండాన్ని అందుకున్నట్టు, ఇది అధికార మార్పిడికి చిహ్నం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతటి చరిత్ర ఉన్న రాజదండాన్ని అందుకున్న నెహ్రూ ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారని, ఆయన సాంప్రదాయాలను గౌరవించకుండా ఆ రాజదండాన్ని మ్యూజియంలో పెట్టేశారనేది ఒక వర్గం వాదిస్తూ దీనంతటికీ నెహ్రూయే కారణమని సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ దండాన్ని నెహ్రూ తన చేతి కర్రగా వాడుకుని వదిలేశాడని అపవాదులు వేస్తున్నారు. ఇందుకోసం అబద్దాల ఫ్యాక్టరీలో రేయింబవళ్లు పని చేసే సంఫ్‌ు పరివార్‌ శక్తులు అదే పనిగా అసత్యకథనాల్ని వండి వార్చే పనిలో ఉంటారు.
రాజదండం అధికార మార్పిడికి చిహ్నంగా జరిగిందని నమ్మినా నాడు జరిగింది రాజరిక మార్పిడి కాదు. పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం. వేలమంది అమరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని గమనంలో పెట్టుకున్న నెహ్రూ ఆ దండాన్ని ఒక కానుకగా భావించే మ్యూజియంలో భద్రపరచమని ఆదేశించి ఉంటారనే ఇంగితం లేని వారు ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారు. పైగా స్వాతంత్య్ర సంగ్రామానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి, బ్రిటీష్‌ సామ్రాజ్యమే దేశానికి రక్ష అని భావించిన సంఫ్‌ు పరివార్‌ శక్తుల వారసులకు రాజదండం అనేది గొప్ప అంశమే అవడంలో ఆశ్చర్యం లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల అనంతరం బానిసత్వంతో కూడిన రాజరికం అనే భావనను ప్రజలు హర్షించని సందర్భంలో ఈ విషయానికి సనాతన సంప్రదాయం అనే పదాన్ని జోడిరచి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నట్టు స్పష్టమవుతోంది.
ఇదిలా ఉండగా మౌంట్‌ బాటెన్‌ నుంచి నెహ్రూ అసలు రాజదండం అనేదాన్ని అందుకోలేదనే వీక్షణం సంపాదకులు ఎన్‌ వేణుగోపాల్‌ ఆధారాలతో సహా చేసిన పోస్టు ద్వారా మరో వాదన చాలా బలంగా ముందుకు వచ్చింది. 1947 ఆగస్టు 17 నాటి ఆంధ్రపత్రికలో వెలువడిన కథనంలో రాజదండం ప్రస్తావన ఉంది. ఆ రాజదండం ఫోటోను కూడా ప్రచురించారు. అయితే ఆ రాజదండాన్ని మౌంట్‌ బాటెన్‌ ఇచ్చినట్టు ప్రస్తావనే లేదు. తమిళనాడులోని తిరువపడుతురై మఠాధిపతి స్వాతంత్య్ర దినం సందర్భంగా నెహ్రూకు బహూకరించినట్టు ప్రత్యేకంగా రాశారు. ప్రధానిగా ఉన్న వారికి చాలా మంది వివిధ సందర్భాల్లో చాలా బహుమతులు, జ్ఞాపికలు ఇస్తుంటారు. ప్రధానిగా మోదీ కూడా ఇటువంటి అనేక జ్ఞాపికలు అందుకున్నారు. అందులోని చాలా బహుమతులను వేలం వేసినట్టు పత్రికల్లో పెద్ద పెద్ద వార్తా కథనాలు వచ్చాయి. అటువంటి జ్ఞాపికే ఇప్పుడు చర్చకు కారణమైన రాజదండం అనేది ఆ వార్తను గమనిస్తే స్పష్టమవుతుంది.
కానీ ఈ అంశాన్ని సంఫ్‌ు పరివార్‌ శక్తులు కావాలనే అసత్య కథనాలతో ఉన్నవీ లేనివీ కలిపి ప్రచారంలోకి తెస్తున్నాయి. నెహ్రూపై తమ అక్కసును వెళ్లగక్కడం ఇందులో ఒక భాగం. పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా, రాష్ట్రపతి చేత ప్రారంభింప చేయాలని 19 పార్టీలు చేస్తున్న కీలకమైన డిమాండుపై చర్చ జరుగుకుండా చూడడం మరో ఎత్తు. అత్యంత ప్రధానంగా మనువాద రాజ్య స్థాపన అనే సంఫ్‌ు పరివార్‌ అజెండాను అమలుపర్చడం మరో అంశం. రాజరికం తరహా పాలన భారత్‌లో ఉండాలనేది వారి ఆకాంక్ష. అందుకు అనుగుణం గానే ఎన్నికలు, ప్రజాస్వామ్యం అనే భావనే లేని రాజ్యాన్ని స్థాపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ సీనియర్‌ నేత, పుల్వామా ఘటనకు మోదీ వైఫల్యమే కారణమని బాహాటంగా పేర్కొన్న కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇటీవల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2024లో మోదీని గద్దె దించకపోతే భారత్‌లో ఇక ఎన్నికలే ఉండవని, ప్రజాస్వామ్యం అంతరించి రాజరికం వంటి పాలన సాగుతుందని ఆయన చేసిన హెచ్చరికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ కావలసిన పార్లమెంటులో రాజరికాన్ని ప్రతిపాదించే రాజదండం అవసరం ఏమిటో విజ్ఞత కలిగిన ప్రజలే ఆలోచించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img