Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్యం

టి.వి.సుబ్బయ్య

రాజు తీసుకున్న నిర్ణయమే అమలు జరుగుతుంది. ఇది నియంతల పాలన. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు, విధానాలు అమలు చేయాలి. పాలకులు సొంత ఎజెండాలను అమలు చేయకూడదు. క్రూరమైన బ్రిటీష్‌ వలస పాలన నుంచి విముక్తి కోసం దేశ ప్రజలు మహత్తర పోరాటం చేశారు. ప్రజలందరి కోసం పాలన ఏర్పడు తుందని, స్వాతంత్య్రం లభిస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన, త్యాగాలు చేసిన కోట్లాది ప్రజల జీవితాలు ఛిద్రమవు తున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్నట్టు కార్యనిర్వాహక, శాసనా, న్యాయ వ్యవస్థలు వేటికవి స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేయడం లేదు. పరిపాలనా వ్యవస్థ మాత్రమే తక్కిన వ్యవస్థ లన్నిటినీ అజమాయిషీ చేస్తోంది. పాలకులు సొంత అజెండా అమలు కోసం ఆడ్డదారులు తొక్కి తాము అనుకున్నది సాధించుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ప్రజల పాత్ర ఓట్లు వేసే వరకే పరిమితం. ప్రజా ప్రతినిధులు అంగడి సరుకుగా మారిపోయారు. ఇది చాలా కాలంగా తక్కువ స్థాయిలో జరుగుతోంది. ఎనిమిదేళ్లకు ముందు సైతం ఈ పరిస్థితి ఉంది. ఇప్పటి సమాఖ్య వ్యవస్థలో పాలకులు టోకుగా లేదా వ్యక్తులుగా ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి తెల్లవారేటప్పటికి ప్రభుత్వాలను మార్చివేస్తూ మనది ప్రపంచంలోనే ప్రభావవంతమైన ప్రజాస్వామ్యమని దేశ విదేశాల్లో డప్పు కొట్టుకుంటున్నారు.
మతోన్మాదం పాలనా వ్యవస్థలోని అన్ని విభాగాలను, అత్యధిక ప్రజలను ఆవహిస్తోంది. పసి మనసులను సైతం కలుషితం చేసేందుకు రాజ్యాంగంలో పొందుపరిచి శాస్త్రీయత, సాంకేతికత, హేతుకత, జ్ఞానాన్ని యుక్తాయుక్త విచక్షణను నేర్పవలసిన అంశాల స్థానంలో పాఠ్య పుస్తకాలలో మత భావనలను, పుక్కిటి పురాణాలను, జ్యోతిష్యాలను బోధించే పాఠాలను చేర్చడం నేటి అత్యంత విషాదకర పరిణామం. శాస్త్రీయ, సాంకేతిక, లౌకిక భావనలను, సర్వ మతాలు గతంలోనూ సమానమే అనే భావజాలం, చరిత్రను బోధించడానికి, విస్తరించడానికి జరగవలసినంత కృషి జరగలేదు. నేడు మత విద్వేషం, కులాల కుమ్ములాటలు విచ్చలవిడిగా నాట్యం చేస్తున్నాయి. ఇలాంటి వాటికి కారకులైన ఈ దుర్మార్గాలు మౌనంగా ఉంటూ వీటిని మరింత పెంచి పోషిస్తున్నారు. స్వాతంత్య్రం కోసం కుల మతాలలో నిమిత్త మహత్తర పోరాటాలు చేసి స్వాతంత్య్రం సాధించుకున్నారు. నేటి పాలకులు నాటి పోరాటాల లక్ష్యాలను తుంగలో తొక్కి మత చిచ్చురేపి తమ పబ్బం గడుపుకుంటున్నారు. పాలనను పక్కన పెట్టి మతోన్మాద భావజాలం న్యాయ, శాసన, కార్య నిర్వాహక వ్యవస్థలను, అత్యధిక ప్రజలను కమ్మివేయడానికే 24 గంటలు పని చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంతో ఏ సంబంధంలేని ఆనాటి జమీందార్లకు, రాజులకు, పాలెగాళ్లకు అండగా నిలిచిన శక్తులు ఇవి. మళ్లీ మధ్య యుగాల నాటి నిరంకుశమైన, కులాలు, మతాలు పాతుకుపోయి ఉన్న కాలానికి ప్రజలను నడిపించాలన్న ధ్యేయంతోనే పని చేస్తున్నారు.
నేటి పాలనలో అసహనం, విద్వేషాలు సమాజాన్ని మొహరించాయి. రోజూ ఏదో ఒక మూల అసహన, విద్వేష ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. నిష్కారణంగా జర్నలిస్టులను, సామాజిక హక్కుల కోసం పారోడుతున్న కార్యకర్తలను, పాలనా వ్యవస్థలో పాలనను విమర్శించే వారిని, అలాంటి రచనలు చేసే వారిని, మేధావులను అరెస్టుచేసి జైళ్లలో కుక్కి హింసిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల పక్షాన పని చేయవలసిన పోలీసు వ్యవస్థ, కొన్ని విషయాలలో న్యాయ వ్యవస్థ ప్రజా వ్యతిరేకంగా పని చేస్తున్నాయని భావించవలసిన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌, జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌, నూపుర్‌ల విషయంలో విధ్వంసకపరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు అనుసరించిన పద్ధతులను సమర్థిస్తున్నట్టుగా కొందరు న్యాయమూర్తుల తీర్పులు ఉండటం ఆశ్చర్యం. న్యాయ వ్యవస్థ ముందు కశ్మీరుకున్న స్వతంత్రతను దెబ్బతీసే 370 అధికరణ రద్దు పై దాదాపు వంద పిటిషన్లు దాదాపు మూడేళ్లకు పైగా విచారణకు నోచుకోలేదు. అలాగే కొరెగావ్‌ విషయంలో అన్యాయంగా అరెస్టు చేసిన సామాజిక కార్యకర్త స్టాన్‌స్వామి లాంటి అనేక మంది సమాజ హితులైన మేధావులను అరెస్టు చేశారు. కనీస చికిత్స కూడా లభించక జైలులోనే మృతి చెందడం నేటి పాలకుల దుర్మార్గాలకు ఒక స్టాన్‌స్వామి తార్కాణం మాత్రమే. ఇక ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ దిగజారుతున్నప్పటికీ తాము గొప్ప అభివృద్ధిని సాధించామని డప్పు కొట్టుకోవడం వారికే చెల్లింది. కొవిడ్‌`19 మహమ్మారి వల్ల మాత్రమే ఆర్థిఖ వ్యవస్థ కుదేలైందనేది సత్యం కాదు. ఈ మహమ్మారికి ముందే ఆర్థిక వ్యవస్థ దిగజారింది. ఈ విషయాన్ని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తాయి. లాక్‌డౌన్‌ అకాలంలో (అప్పటికి 5.6 వందల కొవిడ్‌ కేసులు ఉన్నాయి) విధించడంతో అన్ని వ్యవస్థలు స్తంభించాయి. పెద్ద నోట్ల రద్దు కోసం చెప్పిన కారణాల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదు. నల్ల ధనం పెరిగింది. టెర్రరిస్టులకు నిధులు అందుతూనే ఉన్నాయి. దేశం ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లక్షలాది మందికి ఉద్యోగాలు వూడిపోయాయి. ఆనాటి చర్య దుష్ప్రభావం నేటికీ సమసిపోలేదు. ఆర్థికం పూర్తిగా పుంజుకోలేదు. అయినా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిఖ వ్యవస్థ మనదేనని ప్రచారం చేసుకోవడానికి వెరపు చెందడం లేదు. చట్టాలు, విధి విధానాలు ప్రతిపక్ష పార్టీలకు, సామాన్యులకు వ్యతిరేకంగా అమలు చేస్తున్నారు. పాలకులకు ఏ చట్టాలు, విధి విధానాలు వర్తించవు. నూపుర్‌శర్మ వ్యాఖ్యలు దేశంలో ద్వేషం రగలడానికి కారణమయ్యాయి. తీస్తా సెతల్వాడ్‌, జుబేర్‌ లాంటి న్యాయం కోసం పోరాడే వాళ్లను అక్రమంగా అరెస్టు చేసినా న్యాయస్థానం సైతం వీరికి అననుకూలంగానే ఉంది.
పార్లమెంటులో చర్చ లేకుండానే చట్టాలు తయారవుతున్నాయి. వందలు వేల కోట్లు పోగు చేసుకున్న వారే చట్ట సభలకు ఎన్నికై మరింత సంపద కోసం, ఉన్నదాన్ని కాపాడుకునేందుకు పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలంటే వీరికి అసహ్యం. చట్టసభల్లో చేతులెత్తడానికి పరిమితమవుతున్నారు పాలక పార్టీ సభ్యులు. ప్రజాస్వామ్య విలువలంటే వీరికి అసహ్యం. చట్టసభల్లో చేతులెత్తడానికి పరిమితమవుతున్నారు పాలక పార్టీ సభ్యులు. ప్రజాస్వామ్యంలో ప్రస్తుత పాలకులు నిరంకుశుల్లాగా పాలిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి ఆలోచించరు. ఇక రాష్ట్రాల హక్కులను కేంద్రంలోని సమాఖ్య ప్రభుత్వం హరిస్తున్నది. రాష్ట్రాల పాలకులను సామంతులుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ప్రజా క్షేమం కోసమేనని చెప్తున్న నేటి కేంద్ర పాలకుల స్థానంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, హక్కులను రక్షించుకొనే ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ప్రజల పైనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img