Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంటలకు గ్యారంటీ మద్దతు ధర ఇవ్వాలి

డా॥ సోము మర్ల

సాగు చట్టాల రద్దుతో ప్రస్తుతం వ్యవసాయంలో నెలకొన్న సంక్షోభం సమసి పోదు. గత మూడు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యు.టి.ఒ ఒత్తిళ్ల మూలంగా గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు, బడ్జెటు తగ్గి గ్రామీణభారతం, ప్రజల సంక్షేమం తీవ్రమైన కష్టాల్లోకి జారిపోయాయి. చిన్న, కౌలురైతులకు మేలు చేసే వ్యవసాయ సంస్కరణలు వస్తేనే గాంధీజీ కోరిన గ్రామ స్వరాజ్యం సిద్ధించగలదు.

ఇటీవల మూడు సాగుచట్టాల రద్దుపై ప్రధాని ప్రకటన వెలువడిన నేపథ్యంలో లక్నోలోని ఎకొగార్డెన్‌ మైదానంలో రెండు రోజుల క్రితం (నవంబరు 22వ తేదీన) కిసాన్‌ సంయుక్త మోర్చా మహా పంచాయత్‌ విజయ వంతంగా నిర్వహించింది. దీనికి దేశంలోని పలు రాష్ట్రాల నుండి దాదాపు నలభైౖ వేల మంది రైతులు పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తూనే ఇతర ప్రధాన డిమాండ్లు ఆమోదం పొందే వరకూ రైతుల పోరాటాన్ని కొనసాగి స్తామని కిసాన్‌ మోర్చా నాయకత్వం ప్రకటించింది. ముఖ్యంగా 23 పంటలకు దేశ వ్యాప్తంగా గ్యారంటీ మద్దతు ధర లభించేలా గ్యారంటీ ధర చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని, మూడు సాగుచట్టాల రద్దుబిల్లును ఏ నిబంధనలు లేకుండా సత్వరం పార్లమెంటులో ఆమోదింపచేసి రాష్ట్రపతి ఆమోదాన్ని పొందాలని, లఖింపూర్‌లో రైతులను హతమార్చిన ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్రమంత్రి మిశ్రాను వెంటనే బర్తరఫ్‌ చేయాలని, మరణించిన 700 మంది రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రతిపాదిత విద్యుత్‌, విత్తన బిల్లులను ఉపసంహరించుకోవాలని కోరారు.
దాదాపు సంవత్సర కాలంగా ప్రభుత్వ నిర్బంధాలను, పోలీసుల దౌర్జన్యాన్ని, విపరీతమైన చలి, వేడికి వెరవకుండా శాంతియుతంగా సత్యాగ్రహం చేసిన రైతు సోదరీ సోదరుల కృషి ఫలితంగానే సాగు చట్టాలు రద్దయ్యాయని, పేర్కొన్న డిమాండ్ల సాధన వరకు పార్లమెంటుకు ట్రాక్టరు ర్యాలీ తదితర కార్యక్రమాలు కొనసాగగలవని ప్రకటించారు.
మద్దతు ధరలకు గ్యారంటీ
ప్రభుత్వం ప్రతి సంవత్సరం వివిధ పంటలకు వ్యవసాయ వ్యయం, మద్దతు ధరలు కమిషన్‌ (సి.ఎ.సి.పి) నివేదికల ఆధారంగా వివిధ పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుందే కానీ సాగుపై పెట్టే ఖర్చులన్నిటినీ సమగ్రంగా లెక్కలోకి తీసుకోకపోవటం వలన సాధారణంగా ఈ ప్రకటిత ధరలు అంత గిట్టుబాటుగా ఉండవు. కొంతవరకైనా బయటి మార్కెట్‌లో బేరసారాలకు ఈ మద్దతు ధరలు ఉపకరిస్తాయి. ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్‌.సి.ఐ) వంటి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల్లో అమ్మకాలకు ఈ ధరలు ఉపకరిస్తాయి. కానీ సాగు ఖర్చులు లెక్కించటానికి ప్రస్తుత ఎరువులు, డీజిల్‌, కూలీ వగైరాలు పెంపును కాకుండా 2011 సంవత్సరపు సాగు ఖర్చులను ఆధారంగా తీసుకొని సి.ఎ.సి.పి మద్దతు ధరలను నిర్ణయించటం వలన రైతు నష్టపోతున్నాడు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎకరంలో వరి సాగుకు క్వింటాలుకు దాదాపు రూ.3,200 ఖర్చు కాగా, ప్రభుత్వ మద్దతు ధర రూ.1,940 కి మించటం లేదు. రైతుకు కలిగిన నష్టాన్ని పూడ్చటానికి స్వామినాథన్‌ కమిషను ఫార్ములాను అనుసరించి క్వింటా లుకు రూ. 3,200 ప్రకటించాలి. ఈ ఫార్ములాలోని అన్ని అంశాలను సి.ఎ.సి.పి పరిగణనలోకి తీసుకోవటం లేదు కనుక స్వామినాథన్‌ కమిషను సిఫార్సుల ననుసరించే మద్దతు ధరలను నిర్ణయిస్తున్నామనే ప్రభుత్వ వాదన అసత్యం.
గ్యారంటీ ధరతో ప్రభుత్వానికి మేలే
ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు అన్ని ప్రాంతాల రైతులకు ఉపకరిం చటంలేదు. పంజాబ్‌ 65శాతం, హర్యానా 58 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 65 శాతం, తెలంగాణ 58 శాతం, పశ్చిమ బెంగాల్‌ 26 శాతం కాగా దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వఎఫ్‌.సి.ఐ ఇతర కొనుగోలు కేంద్రాలలేమితో రైతులు గోధుమ, వరితో సహా అన్నిపంటలను వ్యాపారులకు మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ము కోవాల్సి వస్తున్నది. రైతాంగంలో 84శాతంగా ఉన్న చిన్న, కౌలుదారులు కళ్ళా ల్లోనే వ్యాపార్లకు, వడ్డీ వ్యాపార్లకు ప్రకటిత మద్దతు ధరల కంటే కనీసం 20 నుండి 25శాతం తక్కువగా విక్రయించుకుంటున్నారు. కాగాప్రభుత్వ ప్రకటిత మద్దతుధరలు మార్కెట్‌లో బేరసారాలకు పాక్షికంగానైనా ఉపయోగ పడ్తున్నాయి. ప్రభుత్వం వివిధపంటలకు (23 పంటలకు) మద్దతు ధరలను ప్రతీ సంవత్సరం ప్రకటిస్తున్నా, మార్కెట్‌లో గ్యారంటీధర లభించటంలేదు. ఉదా హరణకు చిన్న రైతులకు మార్కెట్‌లో వరికి 20శాతం, మొక్కజొన్న, సోయా చిక్కుళ్లకు 30శాతం, టమాటా, ఉల్లి, పత్తికి 20నుండి 80 శాతం ధర తక్కువగా పలికి రైతులువెచ్చించిన సాగుఖర్చులుసైతం మార్కెట్‌లోదక్కక అప్పుల పాలవుతున్నారు.
ధరల స్థిరీకరణ నిధి
మద్దతుధరలకు దిగువన ధరలు పడిపోయిన సందర్భాల్లో వచ్చే నష్టాలను గ్యారంటీ ధరల చట్టం ద్వారా, ప్రభుత్వం ‘ధరల స్థిరీకరణ’ నిధి ద్వారా పూరించాలి. మార్కెట్‌లో వివిధ వస్తువులకు కనీస ధర (ఎమ్‌.ఆర్‌.పి) లభిస్తున్న విధంగానే రైతు అమ్మే పంటలకు కూడా నిలకడైన, గిట్టుబాటు కాగల ధర లభించాలి. ధరల స్థిరీకరణ నిధికి సాలీనా కేంద్ర బడ్జెట్‌లో 50 నుండి 60 వేల కోట్ల రూపాయలకు మించి వ్యయం కాదని ఆర్థిక నిపుణుల అంచనా.
ప్రతి సంవత్సరం ప్రభుత్వం దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు విదేశాల నుండి నూనెగింజలు, పప్పుధాన్యాలు దిగుమతికై వెచ్చిస్తున్నది. వరి,గోధుమతో సహా నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు గ్యారంటీధరలు కల్పిస్తే వీటిసాగులాభసాటిగా గోచరించి వీటిఉత్పత్తులుగణనీయంగా పెరుగుతాయి. దిగుమతులపై వెచ్చించేవిలువైన విదేశీకరెన్సీని మన రైతులకే (అందులో కొంత భాగమే ఖర్చుగా) ఇవ్వవచ్చును. దేశం వంటనూనెలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయంపోషకత్వాన్ని సాధించగలదు. చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనె గింజల్లో కొంత భాగమైనా ఎఫ్‌.సి.ఐ దేశ ఆహార పంపిణీ వ్యవస్థకై కొనుగోలు చేయటంవలన సామాన్యప్రజలకు పోషకాహారం అందుబాటులోకి వచ్చి ఆరోగ్యం బాగుపడగలదు.
సాగు చట్టాల రద్దుతో ప్రస్తుతం వ్యవసాయంలో నెలకొన్న సంక్షోభం సమసి పోదు. గత మూడు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యు.టి.ఒ ఒత్తిళ్ల మూలంగా గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు, బడ్జెటు తగ్గి గ్రామీణభారతం, ప్రజల సంక్షేమం తీవ్రమైన కష్టాల్లోకి జారిపోయాయి. చిన్న, కౌలురైతులకు మేలు చేసే వ్యవసాయ సంస్కరణలు వస్తేనే గాంధీజీ కోరిన గ్రామ స్వరాజ్యం సిద్ధించగలదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img