Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రగతిశీల సాహిత్యోద్యమ పతాక ‘అరసం’

పెనుగొండ లక్ష్మీనారాయణ

(2023 ఫిబ్రవరి 11, 12 తేదీలలో
19వ రాష్ట్ర మహాసభలు తెనాలిలో
జరుగుతున్న సందర్భంగా..)

అరసం అనే సంక్షిప్తనామంతో తెలుగు సమాజంతో మమేకమైన అభ్యుదయ రచయితల సంఘం 80వ వార్షికోత్సవ సందర్భమిది. ఈ ఎనిమిది దశాబ్దాలుగా సమాజ ఉన్నతీకరణకు సాహిత్యం ఎంత దోహదపడుతుందో ఆచరణ ద్వారా, రచనల వలన రుజువు చేసిన మహత్తర చరిత్ర అరసానిది. 1943 ఫిబ్రవరి 13,14 తేదీలలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభలు జరిగిన తెనాలిలోనే 2023 ఫిబ్రవరి 11,12 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు జరుగుతుండటం విశేష సన్నివేశం.
తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి మూల పురుషులైన కందుకూరి, గిడుగు, గురజాడసామాజిక, సాహిత్య, భాషా సంస్కరణలనుÑ భూస్వామ్య సంస్కృతిపై వారు జరిపిన పోరాటాల వారసత్వాన్ని అరసం స్వీకరించింది. సమతవైపు ప్రపంచగతిని మార్చిన మహత్తరమైన మార్క్సిజమ్‌ సిద్ధాంతాన్ని అరసం తన తాత్విక భూమికగా మలచుకుంది. భారత జాతీయ రచయిత ప్రేమ్‌చంద్‌ అధ్యక్షతన 1936 ఏప్రిల్‌ 9న లక్నోలో ఆవిర్భవించిన అరసం దేశంలోని అన్ని ప్రాంతాలకు, భాషలకూ ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పడిన తొలిసంస్థ. ఆ మహాసభలో ప్రేమ్‌చంద్‌ ‘జీవితాన్ని విమర్శించేదే సాహిత్యం’ అని అధ్యక్షోపన్యాసంలో వివరించారు. ‘‘చిరకాలంగా యథాతథవాదుల చేతుల్లో పడి కునారిల్లిపోతున్న సాహిత్యాన్ని, కళలను పరిరక్షించి వాటిని ప్రజలకు చేరువ చేయడం, వాటిని జీవిత వాస్తవిక చిత్రీకరణకు ఉపకరించే కీలకమైన ఉపకరణాలుగా మార్చడం, మనం ఆకాంక్షిస్తున్న భవిష్యత్తువైపు నడిపించడం మన సంఘం లక్ష్యం’ అని అరసం 1936లో తన తొలి ప్రణాళికలో ప్రకటించింది.
ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభకు అధ్యక్షత వహించి ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు దేవుడు, మతం, ప్రేమ, ప్రణయం కర్మ అనే గాలి మాటలకు వ్యతిరేకంగా పోరాడాలని రచయితలకు పిలుపిచ్చారు. ‘‘నేటి వరకు సారస్వతం, తదితర కళలు ఛాందసవర్గాల చేతుల్లో నలిగి మలినమవు తున్నవి. వాటిని వారి ఆధిపత్యం నుంచి తప్పించడం, ప్రజా సముదాయానికి సన్నిహితపరచడం, జీవిత యదార్ధాన్ని ఉన్నది వున్నట్లుగా కనపరిచే శక్తిమంతమైన సాధనాలుగా చేయడం, ఇవి సంఘం ప్రధానోద్ధేశ్యాలు’’ గా ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం 1943 లో ప్రకటించిన తొలి ప్రణాళికలో పేర్కొంది. 1973 ఆగస్టు 10,11,12 తేదీలలో గుంటూరులో జరిగిన ఆరవ రాష్ట్ర మహసభలలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంగా రూపొందింది. మరొక ప్రణాళికతో ముందుకొచ్చింది. ఇప్పటి వరకూ అరసం ప్రపంచ, దేశ, రాష్ట్ర కాల పరిస్థితులను దృష్టిలో వుంచుకొని ఎప్పటికప్పుడు నిత్యనూతన ప్రణాళికలతో పురోగమిస్తోంది.
అరసం ‘తెలుగుతల్లి’ నుంచి ‘అభ్యుదయ దాకా పత్రికలను నడిపింది. వేల సంఖ్యలో పుస్తకాలను ప్రచురించింది. సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణ లెక్కకుమించి 1946 మే 11 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఆంధ్రసాహిత్య పాఠశాలను ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమ్‌శేఖరశర్మ అధ్యక్షతన గుంటూరు జిల్లా పెదపూడిలో నిర్వహించింది. ఇంకా అనేక సాహిత్య పాఠశాలలను వివిధ ప్రాంతాలలో నిర్వహించింది. ఎందరినో సాహిత్యరంగానికి అందించింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అభ్యుదయ రచయితలు పెన్నుగన్నూ పట్టి నిబద్ధత సమగ్రతలతో ప్రజాపక్షం వహించారు. అరసం అనేక నిర్భంధాలను, నిషేధాలను చూసింది. ‘పోరాటాలే స్ఫూర్తి’ పోరాటాలకు స్పూర్తి ’ నినాదంతో అరసం రచయితలు అన్ని ప్రక్రియలలో అన్నివేళలా సాహిత్య సృజన గావిస్తూనే వున్నారు. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని తెలుగునాట సోదర సంస్థ ప్రజానాట్యమండలితో కలిసి నిర్వహించటంలో అరసంది నాయకపాత్ర.
కాలక్రమంలో ఎన్నో ఉద్యమాలు, ధోరణులు, అస్తిత్వవాదాలు తలెత్తినా అభ్యుదయ సాహిత్యం ఒక సజీవ స్రవంతిగా ప్రవహిస్తూనే వుంది. ఎన్ని సంస్థలు పుట్టుకొచ్చినా అరసం నాలుగు తరాల సాహితీవేత్తలకు, మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంది. వైరుధ్యాలను మిత్ర వైరుధ్యాలుగా పరిగణిస్తూ సోదర సంస్థలకు స్నేహ హస్తం అందిస్తూనే ఉంది. వర్తమానంలో దేశం, రాష్ట్రం సామాజిక, సాంస్కృతిక సంక్షోభంలో వున్నాయి. ఈ సంక్లిష్ట సందర్భంలో ప్రగతిశీల సాహిత్య సాంస్కృతిక శక్తులపై ఎన్నో భాధ్యతలున్నాయి విస్తృత ప్రాతిపదికపై అందరమూ కలిసి అనివార్యంగా పని చేయాల్సిన అవశ్యకత ఎంతైనా వుంది. అరసం 19వ రాష్ట్ర మహసభలు ప్రధానంగా యిస్తున్న పిలుపు ఇదే!
ఎనిమిది దశాబ్దాలు అరసం సుదీర్ఘ చరిత్రలో ఎందరో మహనీయులు తమ శక్తియుక్తులను ధారబోశారు. మార్గ దర్శకులయ్యారు. ఆ దీపధారులకు జోహర్లు. అరసానిది విలువైన గతం, బలమైన వర్తమానం, ఆశావహమైన భవితవ్యం.
అరసం జాతీయ కార్యదర్శి,
సెల్‌. 9440248778

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img