Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

రాష్ట్రపతి ఎన్నికలోనే ప్రజాప్రాతినిధ్యం అధికం

దేశ ప్రధాని నూతన పార్లమెంటు భవనం ప్రారంభించడం ఏ మాత్రం సముచితం కాదు. అది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరు ఎన్నుకున్న దేశ రాష్ట్రపతి ప్రారంభించడమే సముచితం. అయితే కోర్టులతో సహా కొందరు దేశ ప్రజలందరు ఎన్నుకున్న ప్రధాని ప్రారంభించడం సముచితమే అంటున్నారు. కానీ, ప్రధానిని దేశ ప్రజలందరు ఎన్నుకోలేదు. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ఎన్నుకోలేదు. కేవలం అధికారంలోఉన్న బీజేపీ ఎంపీలు మాత్రమే ఎన్నుకున్నారు. ఒక్క రాష్ట్రపతిని మాత్రమే దేశంలో ఉన్న ప్రజా ప్రతినిధులందరు ఎన్నుకున్నారు. దేశంలో ఉన్న ప్రతి ఎంపి, ప్రతి శాసనసభ్యుడు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. అందువల్ల దేశ ప్రజలందరికి సంబంధించిన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అర్హత ఒక్క రాష్ట్రపతికే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశ పౌరుడే కేంద్ర బిందువు. వ్యవస్థలు, రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఏర్పడినవి. అందువలన సమాజంలో మనిషే కేంద్రబిందువు. ప్రస్తుతం అలాకాక మనిషితో సంబంధం లేకుండా మనిషి కోసం చట్టాలు చేస్తున్నారు. ప్రజలకు మంచి పాలన అందించవలసిన వారు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు దేశంలో ఏలుబడి సాగిస్తున్నాయి.
పార్లమెంటు భవన ప్రారంభంలో సర్వమత ప్రార్థనలు చేస్తారట. లౌకిక రాజ్యాంగంలో ప్రతిమతాన్ని సమానదృష్టితో చూడమన్నారు గాని అన్ని మతాలను ప్రోత్సహించమనలేదు. మతం వ్యక్తిగతమే కాని సమాజపరం కాకూడదు. పాలకులు మతాలను, కనపడని దేవుళ్లను పూజించి ప్రోత్సహించడం సెక్యులర్‌ స్టేటుకు విరుద్ధం. ఎవరి మతాన్ని వారు ప్రోత్సహించుకోవచ్చు. అది వ్యక్తిగతంగా ఇంటికే పరిమితం కావాలి. కానీ అన్ని మతాలకు సంబంధించినచోట ఒక మత వ్యాప్తికి ప్రభుత్వం ప్రోత్సహించరాదు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజలవే అనే సంగతి మరువరాదు. ప్రజలందరికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్క హిందూ మతానికి సంబంధించిన శ్రీ వేంకటేశ్వరుని ఫొటోలు పెట్టడం సమంజసం కాదు. క్రైస్తవులు, ముస్లింలు మన దేశంలో మైనారిటీలు కావడం వలన తలొంచి ఊరుకుంటున్నారుగానీ వారు కూడా తమ దైవం ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో బస్సు స్టాండుల్లో పెట్టమని పోరాటం చేస్తే అది ప్రభుత్వానికి తలనొప్పిగ మారవచ్చు. ప్రధాని మోదీ మాటల మాంత్రికుడు. మాటలతో గారడి విద్యను ప్రదర్శించి ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజలు నమ్మి ఎన్నుకున్న ప్రభుత్వాధినేతలు ప్రజల ఆస్తులను స్నేహితులకు దారాదత్తం చేసే హక్కు ప్రజలు ఓటు ద్వారా కల్పించలేదు. ప్రజలెన్నుకున్నంత మాత్రాన ప్రజల ఆస్తులు పరిశ్రమాధిపతులకు, స్నేహితులకు దారాదత్తం చేసి ప్రజలను మోసగించడం సమంజసమా. ఎల్‌ఐసీ, ప్రభుత్వ బ్యాంకులలో ప్రజలు నమ్మి దాచుకున్న సొమ్ము స్నేహితుడైన అదానీకి తదితర ఆశ్రితులకు ఇవ్వడం సమంజసమా? ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడం కాదా? ప్రజాస్వామ్య విలువలను నీరుగార్చి, విలువల్ని నాశనంచేసి ప్రజాహిత సంస్థల్ని బలహీనపరచి దాడులు చేయడం సమంజసమా?
ఇదిలా ఉండగా కొత్తగా రాజదండం ఒకటి వచ్చిపడిరది. రాజరిక వ్యవస్థలోని రాజదండం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమా. రాజదండం ప్రథమ ప్రధాని నెహ్రూ చేతికర్రగా వాడుకున్నారన్న ప్రచారం శుద్ద అబద్ధం. మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకుంటాం. అలాంటప్పుడు రాచరిక వ్యవస్థలోని రాజదండం ఎందుకో సామాన్యులకు అర్థం కావడం లేదు. బలహీనవర్గాల మనిషినని పేద ప్రజలకోసమే తన సేవలని, పేదలను, ఉద్ధరించడానికే పుట్టినట్లు ఎన్నికల ప్రచారంలో మాట్లాడి పేదలకిచ్చే సంక్షేమ కార్యక్రమాల నిధులకు కోత పెట్టడం ఏమనుకోవాలి. కోవిడ్‌ మరణాలకు సంబంధించి రెండు లక్షలున్నారు. ఆ తరువాత యాభైవేలన్నారు. మరణించిన కుటుంబానికి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇదంతా మాటలతో గారడి చేయడమేకదా. ఇప్పటికైనా ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చేరకంగా రాజకీయ పార్టీలు మారాలి.
బి.రాధాకృష్ణ
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img