Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పూర్తిస్థాయి ఉద్యోగాల భర్తీకి ఉద్యమిస్తాం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అరకొర ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి, పూర్తి స్థాయిలో ఖాళీ పోస్టుల నియామకం జరిగేలా నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు అధ్యక్షతన రౌండుటేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, తెలుగు యువత, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎస్‌టీయూ, పీడీఎస్‌యూ నేతలు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,35, 794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతోందన్నారు. అధికారం చేపట్టి రెండేళ్ల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం యువతను మోసగించడమేనన్నారు. రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. నెలకు ఐదువేల రూపాయల వేతనంతో సేవలందిస్తున్న వలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడమేమిటని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీ భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మిగిలిన ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో యువతకు సమాధానమివ్వాలని డిమాండు చేశారు. రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌లో మార్పులు చేసి నూతన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, జాన్సన్‌ బాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రవి చంద్ర, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు ఈవూరి వినోద్‌కుమార్‌, తెలుగు యువత విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షులు శ్రావణ్‌ కుమార్‌, రాయపాటి సాయి, అరసం కృష్ణాజిల్లా కార్యదర్శి మోతుకూరి అరుణ్‌ కుమార్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి వేముల శ్రీనివాస్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, ఇన్సాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అప్సర్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రనాయక్‌, ఎస్టీయూ నాయకులు శ్రీనివాసరావు, శ్రీధర్‌ కోచింగ్‌ సెంటర్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్‌ నగర నాయకులు ఎస్‌.లాల్‌ మోహన్‌, కొమ్మినేని మురళి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఎం సాయికుమార్‌, ఉప్పుటూరి అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img