Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

రోహిత్‌, కోహ్లీపై అతిగా ఆధారపడితే
టీమిండియాకు ప్రపంచకప్‌ దక్కదు: కపిల్‌

న్యూదిల్లీ: టీమిండియా తాజా మాజీ సారథులు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపై అతిగా ఆధారపడటం మానేస్తే తప్ప టీమిండియాకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ దక్కదని భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ తేల్చేశాడు. రోహిత్‌, కోహ్లీ దాదాపు కెరీర్‌ చరమాంకంలో ఉన్నారు. ఈ ఇద్దరూ ధోని సారథ్యంలో వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులో ఉన్నారే గానీ వీరి సారథ్యంలో అది అందని ద్రాక్షగానే మిగిలింది. భారత క్రికెట్‌ జట్టు చివరిసారి 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత పదేళ్లుగా ప్రతీసారి భారత జట్టు ఐసీసీ టోర్నీలో పాల్గొనడం, ఉత్తచేతులతోనే తిరిగిరావడం ఆనవాయితీగా మారింది. ధోని వారసుడిగా వచ్చిన విరాట్‌ కోహ్లీ… భారత్‌ కు ఐసీసీ ట్రోఫీ అందిస్తాడని ఆశించినా అతడి వల్ల కాలేదు. కోహ్లీ కాకున్నా ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన రోహిత్‌ శర్మ అయినా భారత్‌ కు ఐసీసీ ట్రోఫీ బెంగ తీరుస్తాడనుకుంటే అతడూ చేతులెత్తేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారత్‌ లో ఈ ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌ లో భారత్‌ కు కీలకంగా వ్యవహరించనున్నారు. జరిగేది భారత్‌ లోనే కాబట్టి ఈ ఇద్దరు దిగ్గజాల కల ఈ యేటితో నెరవేరుతుందని టీమిండియా అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ అలాంటిదేమీ జరగదని, కోహ్లీ…రోహిత్‌ లు భారత్‌ కు ప్రపంచకప్‌ తీసుకురాలేరని, వాళ్లిద్దరి మీద అతిగా ఆధారపడటం మానేస్తే తప్ప టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ దక్కదని తన సారథ్యంలో దేశానికి తొలి వన్డే వరల్డ్‌ కప్‌ (1983) అందించిన కపిల్‌ స్పష్టం చేశాడు. ఓ వార్తా సంస్థతో కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ… ‘ఒకవేళ మీరు ప్రపంచకప్‌ గెలవాలనుకుంటే హెడ్‌ కోచ్‌, సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆసక్తులను పక్కనబెట్టి జట్టు గురించి ఆలోచించాలి. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి ఇద్దరు ముగ్గురు ప్లేయర్ల మీద భారం వేసి వాళ్లను వరల్డ్‌ కప్‌ తీసుకురమ్మంటే అది జరగని పని… మీరు మీ టీమ్‌ పై పూర్తి నమ్మకముంచాలి. మనకు అసలు అలాంటి టీమ్‌ ఉందా..? గుండె మీద చేయి వేసుకుని వీళ్లు మ్యాచ్‌ ను గెలిపించగలరనే మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారా..? జట్టులో కొందరు బాగా ఆడుతున్నారు. కానీ ఒకరిద్దరి మీదో ఆధారపడితే ఐసీసీ వంటి టోర్నీలలో రాణించలేం. కనీసం జట్టులో ఆరుగురు దాకా మ్యాచ్‌ విన్నర్లు ఉంటే అప్పుడు ఫలితాలు ఆశించిన విధంగా వస్తాయి. జట్టును అలా తయారుచేయాలి. విరాట్‌, రోహిత్‌ లను వదిలేయండి, యువకులు ముందుకురావాలి. వాళ్లు బాధ్యతలు తీసుకోవాలి’ అని కపిల్‌ వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img