Friday, April 26, 2024
Friday, April 26, 2024

మాతో పెట్టుకుంటే అట్లుంటది.. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ చేయాలనుకోవటం లేదని.. దీనిపై ప్రస్తుతం ముందుకెళ్లటం లేదని ఆయన ప్రకటించారు. దీంతో.. ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గట్టిగా మాట్లాడింది.. సీఎం కేసీఆరేనని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంపై తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. కేసీఆర్ దెబ్బ అట్లుంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు హరీశ్ రావు కూడా స్పందించారు. విశాఖ ఉక్కును అమ్మకూడాదని కేసీఆర్ కొట్లాడారని.. కేసీఆర్ పోరాటానికి కేంద్రం దిగొచ్చిందని హరీశ్ రావు తెలిపారు. ప్లాంట్‌ను అమ్మటం లేదన్న కేంద్రం ప్రకటన బీఆర్ఎస్ విజయమన్నారు. ఈ ప్రకటనతో.. ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయన్నారు హరీశ్ రావు.అయితే.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని.. దీనిపై ఎంత దూరమైనా పోరాడేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. ఈ క్రమంలోనే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ మొదలు కాగా.. అందులో కూడా తెలంగాణ ప్రభుత్వం పార్టిసిపేట్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని.. అందుకు తామే బిడ్డింగ్ వేసేందుకు సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించారు. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటే ఎంత మంచి జరుగుతుందో కేంద్రానికి తెలియజెప్పాలని భావించింది. అయితే.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే.. ఇన్ని రోజులు ఏపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంతో మాత్రం రెండు ప్రభుత్వాల మధ్య కొంత క్లాష్ వచ్చింది. ఇన్ని రోజులు ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే.. బిడ్డింగ్‌ వేసేందుకు రెడీ అవ్వటమేంటని ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు. దీనివెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. నిజానికి.. బీఆర్ఎస్‌ను ఏపీలో విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోన్న కేసీఆర్‌కు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఓ అవకాశంగా దొరికింది. దీంతో.. వచ్చని అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని చూశారు. తీరా.. కేంద్ర మంత్రే ఇలాంటి ప్రకటన చేయటంతో.. తాము పోరాడబట్టే కేంద్రం వెనక్కి తగ్గిందని కేటీఆర్ చెప్తున్నారు. అయితే.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ అటాక్ చేశారు. కేసీఆర్ చేయబట్టే కేంద్రం వెనక్కి తగ్గిందంటూ.. దీన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము చేయబట్టే.. కేంద్రం వెనకడుగు వేస్తే.. తెలంగాణలో ఎందుకు వెనక్కి తగ్గట్లేదని ప్రశ్నించారు పేర్ని నాని. ఇలా.. ఇరు రాష్ట్రాల నేతలపై మాటాల పంచాయితీ నడుస్తూనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img