Friday, April 26, 2024
Friday, April 26, 2024

సేవా మార్గంతోనే ఉన్నత స్థానాలకు చేరుకోగలం

ఆపద మిత్రల ముగింపు సభలో జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు
218 మందికి ఛైర్మన్‌ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాల అందజేత
విశాలాంధ్ర – విజయనగరం
ః సేవా మార్గం ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించి తోటి వారికి సాయపడాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సాటి పౌరుడిగా ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆపద మిత్రలకు రెండో దఫా శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ముగింపు సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఆపద మిత్రలను ఉద్దేశించి ప్రసంగించారు.ఎన్నో రకాలుగా సమర్ధులైన ఆశా కార్యకర్తలను, గ్రామ వాలంటీర్లను, సామాజిక కార్యకర్తలను ఎంపిక చేసి 12 రోజుల పాటు శిక్షణ అందజేయటం అభినందనీయమని ఛైర్మన్‌ పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తమ కార్యక్రమంలో ఆపద మిత్రలు భాగస్వామ్యం కావటం హర్షణీయమని అన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టాలని, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఆపద మిత్రలకు సూచించారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే సేవే ప్రధాన మార్గమని, దీనికి ఆపద మిత్రలు నిజమైన అర్హులని పేర్కొన్నారు. నిజమైన సేవకులుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలవాలని, ఆపద సమయాల్లో వారిలో ధైర్యం నింపాలని సూచించారు.ప్రభావిత ప్రాంతాల్లో ఉండే మిత్రలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని అదుపు చేసేందుకు తన వంతు కృషి చేయాలని చెప్పారు. ఆత్మ సంతృప్తి కలిగేలా సమాజానికి తమ వంతు సేవ చేయాలని హితవు పలికారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు బాధితులకు అండగా నిలవాలని, సహాయం అందించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో జరిగే బాల్య వివాహాలను అరికట్టేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. చదువు మధ్యలో ఆపేసే వారిపై దృష్టి సారించి అధికారులకు, ప్రజాప్రతినిధులుకు తెలియపరచాలని ఛైర్మన్‌ సూచించారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆపద మిత్రలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం ఛైర్మన్‌ చేతుల మీదుగా ఉమ్మడి జిల్లాలకు చెందిన 218 ఆపద మిత్రలకు ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. సమావేశంలో డీపీఎం పద్మావతి, జడ్పీ ఉప సీఈవో రాజ్‌ కుమార్‌, డీపీవో నిర్మలా దేవి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img