Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

సంకుచిత రాజకీయాలకే ఐటీఐఆర్‌ రద్దు

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటనపై కేటీఆర్‌ మండిపాటు

విశాలాంధ్ర – హైదరాబాద్‌: ఐటీఐఆర్‌ (హైదరాబాద్‌) ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చేసిన ప్రకటనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు తప్పుపట్టారు. సంకుచిత రాజకీయాల కోసం ఐటీఐఆర్‌ రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం, అదే స్థాయిలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ డీఎన్‌ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వల్లెవేశారని కేటీఆర్‌ విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్‌ ఐటీిఐఆర్‌ ప్రాజెక్టును రద్దుచేసి మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు.
2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరి హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ను కూడా మూలన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేకనే, ఐటీిఐఅర్‌ కు ప్రత్యామ్నాయం చూపలేదని అన్నారు. కేంద్రంలోని వివిధ శాఖలు ప్రవేశ పెట్టిన స్మార్ట్‌ సిటీ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్‌ ను రద్దు చేశామని చెప్పడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని కేటీఆర్‌ మండిపడ్డారు.
ఐటీఐఆర్‌ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు మోదీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటి రంగాన్ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఇటీవల ప్రకటించిన సాఫ్ట్‌ వేర్‌ పార్క్‌ లే సాక్ష్యం అన్నారు. ఇంక్యూబేటర్‌ టీ హాబ్‌ -2 నిర్మాణానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్‌వేర్‌ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మొండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై చిన్నచూపునకు నిదర్శనమన్నారు.
ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణకు ఐటీిఐఅర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణపై తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img