Friday, April 26, 2024
Friday, April 26, 2024

దళితులను మింగేస్తున్న కుల వివక్ష

అంటరానితనాన్ని చట్ట వ్యతిరేకమైందిగా చేశారన్న వాస్తవంతో దళితులను హత్యచేసేవారికి, వారి మీద అత్యా చారాలు చేసేవారికి, వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించే అగ్రకులాల వారికి ఏ మాత్రం సంబంధం లేదు. చట్టం దారి చట్టానిది. దళితుల దుస్థితి దళితులది. ఇక్కడ చట్టం తనపని తాను చేసుకుపోదు. చాలా సందర్భాలలో దళితులమీద అత్యాచారాలుచేసిన వారిని, హతమార్చిన వారిని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిన వారిని ఈచట్టం తాకను కూడా తాకదు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక కష్టాలకు ఓర్చి ఉన్నత విద్యాసంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.టి.లలో ప్రవేశం సంపాదించిన దళిత విద్యార్థులుసైతం అక్కడ కులవివక్ష, కులాధిపత్యం భరించలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది. నిజానికి ఇలాంటి ఆత్మహత్యలన్నీ హత్యలే. కానీ ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడు ఒక్క హత్యకేసు కూడా నమోదు కాదు. ఎందుకంటే ఇక్కడ నిందితులు ఒంటరి వారు కాదు. మొత్తం సమాజమే వివక్ష చూపుతుంది కనక సమాజాన్నంతటినీ శిక్షించే వెసులుబాటు లేదేమో. ముంబై ఐ.ఐ.టి.లో మూడు నెలలకింద ఇంజనీరింగ్‌లో చేరిన దర్శన్‌ సోలంకి గత 12వ తేదీ అర్థరాత్రి శవమై మిగిలాడు. ఆ రోజు ఆదివారం. ప్రతివారంలాగే తల్లిదండ్రులతో మాట్లాడాడు. కుళాయిలు బిగించే పనిచేసే అతని పేద తండ్రి దర్శన్‌సింగ్‌ కొడుకు బ్యాంకు ఖాతాలోకి మూడువేల రూపాయలు బదిలీ కూడా చేశాడు. ఆ తరవాత ముప్పావు గంటకే దర్శన్‌ సోలంకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసు కుంటున్నాడో లేఖ రాయడం లాంటి లాంఛనాలు ఏమీ పాటించలేదు. కానీ పరిస్థితులనుబట్టి కులవివక్షకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసు కున్నాడనుకుంటున్నారు. పోలీసులు మాత్రం కారణం తెలియని హత్య కింద కేసు నమోదుచేశారు. అంటే దర్శన్‌ ఆత్మహత్యకు కారణం ఏమిటో, కారకులెవరో ఎన్నటికీ తేలదు. ఐ.ఐ.టి.లో చేరేంతటి చదువు చదివింది ఆ కుటుంబంలో దర్శన్‌ ఒక్కడే. మొదటితరం అక్షరాస్యుడూ ఆ పరివారంలో అతడే. బహుజనులు, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్షే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అని బొంబాయి ఐ.ఐ.టి.లో ఉన్న వారందరికీ తెలుసు. సోలంకి ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కనిపెట్టడానికి ఐ.ఐ.టి. యాజమాన్యం ఓ కమిటీని నియమిస్తుందట. కుల వివక్షే కారణం అని ఆ కమిటీతేల్చినా అది భవిష్యత్తులో ఇలాంటి ఘాతుకాలను నివారించ డానికి ఉపకరించదు. ఎందుకంటే కులవివక్ష సమాజంలో పాతుకు పోయిన దుర్మార్గం. దర్శన్‌ సోలంకీ బొంబాయి ఐ.ఐ.టి.లో చేరిన తరవాత మిగతా వారితో పరిచయాలు, స్నేహాలు కుదుర్చుకోక ముందే అతను జె.ఇ.ఇ.లో ఎన్ని మార్కులు సంపాదించాడో అడగడం మొదలు పెట్టారు. ఈ మార్కులు తెలిస్తే విద్యా విషయాల్లో అతనిస్థానం ఏమిటి, ఏ కులం లాంటివన్నీ కనిపెట్టేయవచ్చు. అప్పుడు ‘‘నువ్వు కోటా విద్యార్థివి’’ అని పక్కకు తోసేయవచ్చు. గేలి చేయవచ్చు. దీని అంతరార్థం ఏమిటంటే దళితుడు ఐ.ఐ.టి. లాంటి ఉన్నత విద్యా సంస్థలో చేరడానికి అర్హతలేదని చెప్పడమే. కులవివక్ష, అంటరానితనంవల్లే దర్శన్‌ సోలంకీ ఆత్మహత్య చేసుకున్నాడని ఒప్పుకోవడం ఐ.ఐ.టి. యాజమాన్యానికి కుదరనిపని. వివక్ష కారణంగానే దర్శన్‌ ఆత్మహత్య చేసుకున్నాడనడం అవాస్తవం. ఇది సంస్థాగతహత్య అని చెప్పడం అంతకన్నా పెద్ద అబద్ధం అని ఐ.ఐ.టి. వాదించింది.
ఆత్మన్యూనతా భావానికి లోనయ్యే దారుణ పరిస్థితులు ఐ.ఐ.టి.ల లాంటి విద్యాసంస్థలలో కూడా ఉన్నాయి కనక అణగారినవర్గాల వారు అఘాయిత్యాలకు పాల్పడడం కొత్తేమీకాదు. ఇదే బొంబాయి ఐ.ఐ.టి. ఆవరణలో 2014లో అనికేత్‌ అంభోర్‌ అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరవాత కూడా అనికేత్‌ మరణానికి కారణం ఏమిటో తేల్చడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వివక్షే ప్రధాన హేతువు అని ఈ కమిటీ తేల్చింది. ఈ కమిటీ నివేదిక 2015లోనే అందినా ఐ.ఐ.టి.లలో ఎస్‌.సి., ఎస్‌.టి. విద్యార్థులకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడానికి మరో ఏడేళ్లు పట్టింది. అయితే ఈ విభాగం నిర్వర్తించ వలసిన బాధ్యత ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా ఎవరికీ తెలియదు. అనేక మంది ఎస్‌.సి., ఎస్‌.టి. విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్య తీసుకున్న జాడలేలేవు. అంబేద్కర్‌, పెరియార్‌ ఫూలే అధ్యయన కేంద్రం, అంబేద్కర్‌ అధ్యయన కూటమి లాంటివి ఈ విభాగం ఏంచేయాలో నిర్వచించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము ఈపని చేయకపోతే ఐ.ఐ.టి. ఎన్నాళ్లయినా పట్టించుకోదని ఆ సంస్థల వారంటున్నారు. మరీ విచిత్రం ఏమిటంటే దర్శన్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఐ.ఐ.టి. అధికారులు ముందు ఎస్‌.సి., ఎస్‌.టి. విద్యార్థుల ప్రత్యేక విభాగానికి తెలియ జేయాల్సింది. కానీ ఆ విభాగానికి పత్రికల్లోచూస్తే కాని ఈ ఘోరం గురించి తెలియనేలేదు.
సోలంకి సంతాపసభ జరిగితే ఐ.ఐ.టి. డైరెక్టర్‌ హాజరు కాకపోగా ఓ సంతాప సందేశం పంపారు. కాని అందులో మృతుడిపేరే ప్రస్తావించలేదు. దర్శన్‌ సోలంకీకి గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలకడంకూడా యాజమాన్యానికి ఇష్టం లేదన్నమాట. బహుజన విద్యార్థులు ఇలాంటి విద్యాసంస్థలలో మనగలగడమే పెద్ద విజయం అనుకోవాలి. వారు గ్రామీణ ప్రాంతాలనుంచి వస్తారు కనక నాలుక మెలిబెట్టి ఇంగ్లీషు మాట్లాడలేరు. వక్తృత్వ పోటీలాంటివాటిలో కనిపించరు. కాలంగడిచే కొద్దీ వివక్షను ఎదిరించి నిలబడేవారు పుంజుకుంటే పుంజుకోవచ్చు. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడడం, కాన్వెంటు మర్యాదలు పాటించడం లాంటి అంశాల ఆధారంగానే అధ్యాపకులు వారిని ఉద్యోగాలకు సిఫార్సు చేస్తుంటారు. చాలా వరకు ఐ.ఐ.టి. ఆఖరి సంవత్సరంలో ఉండగానే ఉద్యోగావకాశాలు వస్తాయి. కానీ దళిత విద్యార్థులకు ఆ అవకాశమూ తక్కువే. బహుజన విద్యార్థులు ఈ సంస్థల్లో ప్రయాణం ప్రారంభించగానే వారిని పరాయి వారిగా చూడడం మొదలవుతుంది. అంటే సామాజిక వెలివేతతప్పదు. బహుజన విద్యార్థుల మానసిక స్వస్థతకోసం ఆరోగ్య కేంద్రాలు లేక పోలేదు. కానీ వాటి అధిపతులు రిజర్వేషన్లకు బద్ధవిరోధులైనప్పుడు వారు సమకూర్చే మానసిక స్థైర్యం ఎంత అథమస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అడుగడుగునా వివక్ష, అడ్డంకులు ఎదురవుతుంటే బహుజన విద్యార్థులు బతికి బట్టకట్టడం ఎంత కష్టసాధ్యమో ఊహించవచ్చు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ వేముల, బొంబాయి ఐ.ఐ.టి.లో దర్శన్‌ సోలంకి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడల్లా ఈ దయనీయ స్థితిగురించి తీవ్రచర్చ జరుగుతుంది. ఆవేదన వ్యక్తమవు తుంది. కొన్నాళ్లకు అంతా మామూలు అయిపోతుంది. ఎక్కడో మరో విద్యార్థో, మరొకరో వివక్షకు బలైపోతూనే ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img