Friday, April 26, 2024
Friday, April 26, 2024

అకాల వర్షాలకు నష్టపోయిన
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి


ముప్పాళ్ల, కేవీవీ ప్రసాద్‌
విశాలాంధ్ర – క్రోసూరు: ఆరుగాలం శ్రమించి పండిరచిన పంటలు అకాల వర్షాలకు నష్టపోయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని తక్షణమే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని అబ్బరాజుపాలెం, బుచ్చియ్యపాలెం, 75 తాళ్లూరు గ్రామాలలో గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప, వరి పంట పొలాలను శుక్రవారం స్వయంగా రైతులతో కలిసి పరిశీలించి వారితో మాట్లాడారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌తో వారు మాట్లాడారు. అకాల వర్షాలకు గ్రామాల్లో నష్టపోయిన రైతుల వివరాలు రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు తెలిపి వారిని ఆదుకోవాలని కోరారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టెడన్నం పెట్టె రైతు కష్టాల్లో ఉంటే వారిని పరామర్శించే తీరిక నేటి పాలకులకు లేకపోవటం సిగ్గు చేటన్నారు. ఒక పక్క గిట్టుబాటు ధరలు లేక, మరో పక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని ఇవ్వాలని, పంటల బీమా పరిహారాన్ని అందించాలన్నారు. రైతులకు సత్వర న్యాయ కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, నాయకులు మునుగోడు శ్రీనివాసరావు, పెదకూరపాడు నియోజవర్గ కార్యదర్శి పెద్దబ్బాయి, భైరాపట్నం రామకృష్ణ, రైతులు వజ్రాల వెంకట్‌ రెడ్డి, కొండవీటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img