Friday, April 26, 2024
Friday, April 26, 2024

అన్నీ లెక్కే…

. పోలీసుల సంగతి తేలుస్తాం
. నేరస్తులకు సహకరించి మాపైనే కేసులు పెడతారా?
. కార్యకర్తల జోలికొస్తే సహించం
. మాజీ సీఎం చంద్రబాబు హెచ్చరిక

విశాలాంధ్ర – చిత్తూరు: కుప్పంలో జరిగిన, జరుగుతున్న ఘటనలు ప్రజలు గమనిస్తున్నారు… నేరస్తులకు సహకరించిన పోలీసులే మాపార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు… అన్నీ లెక్క పెడుతున్నా… పోలీసుల లెక్క తేలుస్తాం అని మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీలు రాజ్‌కుమార్‌, మునస్వామి, జిల్లా వాణిజ్యకార్యదర్శి మంజునాథ్‌, ఆర్‌ఎస్‌ మణి, మునెప్ప, ముఖేశ్‌, సుబ్రమణ్యంలను చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్బంగా వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణకు సంబంధించి పోలీసులు 8మంది టీడీపీ నేతలపై ఐపీసీ సెక్షన్‌లు 307,324, 350,353 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌లో ఉంచారు. వీరిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు జైలు ఎదుట మీడియాతో

మాట్లాడారు. కుప్పం ఘటనలో తమను చంపేందుకు వచ్చిన వారికి సహకరించిన పోలీసులు… తిరిగి మాపైనే కేసులు పెట్టారని, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే జగన్‌ సర్కారుకు వంత పాడుతున్నారని విమర్శించారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులకు అధికారాలు ఉంటే ప్రజలకు హక్కులున్నాయన్నారు. దమ్ముంటే జగన్‌రెడ్డి పులివెందులలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. సొంత చిన్నాన్ననే చంపించిన జగన్‌ ఆ కేసు విచారణ వేగవంతం కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అన్నపై నమ్మకం లేకనే వివేకానందరెడ్డి కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు.
తాను నాలుగేళ్ల నాడు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశానని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఇన్నాళ్లుగా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా తీర్చి దిద్దేందుకు తాను ప్రయత్నిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడుముక్కలాట ఆడుతోందని ఎద్దేవా చేశారు. పోలవరం 75 శాతం పూర్తిచేశానని, ఇప్పుడు రివర్స్‌ టెండర్ల పేరుతో ఆ ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆవేదన చెందారు. పోలీసుల తప్పుడు కేసులలో జైలుకు వెళ్లివచ్చిన వారికి ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఉద్బోధించారు. అనంతరం మాజీ మేయర్‌ కఠారి హేమలత నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు చిత్తూరు పర్యటన సందర్భంగా చంద్రగిరి, నేండ్రగుంట, పూతలపట్టు, వరిగపల్లి తదితర ప్రాంతాలలో టీడీపీ శ్రేణులు బాబుకు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img