Friday, April 26, 2024
Friday, April 26, 2024

అవినీతి అంతస్తులు!

బెజవాడలో జోరుగా అనధికార నిర్మాణాలు

కార్పొరేటర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కుమ్మక్కు
ఒక్కో నిర్మాణానికి రూ.2 నుంచి రూ.8లక్షలు వసూలు
అడ్డుకునేందుకు సచివాలయ సిబ్బంది వెళితే దాడులు!
కార్పొరేషన్‌ ఆదాయానికి భారీగా గండి

విశాలాంధ్రవిజయవాడ కార్పొరేషన్‌ : ఒకవైపు ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు పట్టణ సంస్కరణల పేరుతో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో చెత్తపై పన్ను వసూలుకు రంగం సిద్ధం చేసి నోటీసులు ఇస్తోంది. ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు, డ్రెయినేజీ, నీటి పన్నుల వసూలుకు సిద్ధమైంది. దీనికోసం జీవో నంబర్లు 196, 197, 198 జారీ చేసి, అమలుకు కార్యాచరణ రూపొందించింది. మరోవైపు విజయవాడలో అధికార పార్టీ కార్పొరేటర్లు, అధికారులు కుమ్మక్కై అనధికారిక నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నగరపాలక సంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించే సచివాలయ సిబ్బందిపై కొందరు కార్పొరేటర్లు దాడులు కూడా చేయిస్తున్నారు. దీంతో వారు అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లేందుకు హడలిపోతున్నారు. ఫలితంగా నగరం నలుమూలలా అనధికారిక భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం చేపట్టిన నిర్మాణాల్లో 80 శాతం అనధికారికమేనని అధికారులే చెబుతున్నారు. ఒక్కో నిర్మాణానికి విస్తీర్ణం, ఏరియాను బట్టి రూ.2లక్షల నుంచి రూ.8లక్షల వరకు వసూలు చేసి కార్పొరేటర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పంచుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా నిబంధనలకు నీళ్లు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణాలకు హైదరాబాద్‌ మున్సిపల్‌ యాక్ట్‌1955 ప్రకారం వీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించాలంటే కార్పొరేషన్‌ నుంచి బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. కార్పొరేషన్‌కు సదరు భవనంలో కొంత మార్టిగేజ్‌ చేయాల్సి ఉంది. ఇవి భవన యజమానికి భారం కావటంతో కొందరు అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు మామూళ్లు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ప్రణాళిక ఒకటైతే, నిర్మాణాలు మరోవిధంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే అతి తక్కువ స్థలంలో, రోడ్లు, ఇతర ఇబ్బందులు ఉంటే మూడు, నాలుగు అంతస్తుల నిర్మాణానికి చట్ట ప్రకారం అనుమతి ఇవ్వరు. ఇటువంటి వారు సైతం స్థానిక కార్పొరేటర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆశ్రయించి ముడుపులు ఇచ్చి భవనాలు నిర్మించుంకుటున్నారు. నగరంలోని కృష్ణలంక, పటమట, లబ్బీపేట, గవర్నర్‌పేట, సత్యనారాయణపురం, వన్‌టౌన్‌, అయోధ్యనగర్‌, భవానీపురం, సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో అనధికారిక భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో కార్పొరేషన్‌కు రావాల్సిన కోట్లాది రూపాయిల ఆదాయం పక్కదారి పడుతోంది. గతంలో కృష్ణలంక ప్రాంతంలో రెండు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన వార్డు సచివాలయ సిబ్బందిపై భవన యజమానులు దాడులకు ప్రయత్నించారు. ఒక భవనం వద్ద మహిళా సిబ్బందిపై పెట్రోల్‌ పోసి హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
నగరంలోని లబ్బీపేట వైవీ రావు ఆస్పత్రి రోడ్డులో నిబంధలనకు విరుద్ధంగా కమర్షియల్‌ బిల్డింగ్‌పై మరో అంతస్తు నిర్మించారు. ఇందుకు భవన యజమాని ఓ అధికార పార్టీ కార్పొరేటర్‌తో రూ.8లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. అత్యంత వివాదాస్పదుడు, అధికార పార్టీకే తలనొప్పిగా మారిన ఆ కార్పొరేటర్‌ అందులో కొంత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ముట్టజెప్పి మిగిలినది తన జేబులో వేసుకున్నట్లు తెలిసింది. అదే ప్రాంతంలోని హుస్సేన్‌ వీధిలో అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటర్‌ బంధువు జిG2 భవన నిర్మాణానికి నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తీసుకుని దానిపైన అనధికారికంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రం కావటంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు తెలిసింది. వాణిజ్య ప్రాంతమైన గవర్నర్‌పేట అలీబేగ్‌ స్ట్రీట్‌లో జిG2కు బిల్డర్‌ రెండు గదులకు మాత్రమే అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లోర్‌ మొత్తం నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు రూ.5లక్షలు అందినట్లు ఆ విభాగంలోనే బహిరంగంగా చర్చ సాగుతోంది. అదే ప్రాంతంలోని మనోరమ హోటల్‌ వెనుక రోడ్డులో బందరు రోడ్డుకు అనుకుని భవన యజమాని రెండు డాక్యుమెంట్లు కలిగిన రెండు బిల్డింగుల్లో ఒక దానికి కార్పొరేషన్‌ నుంచి అనుమతులు తీసుకుని మరో బిల్డింగ్‌పై అదనపు ఫ్లోర్‌ నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఓ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌కు దండిగా మామూళ్లు అందినట్లు సమాచారం. పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ మూడో రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా పై అంతస్తు నిర్మించుకునేందుకు సంబంధిత భవన యజమాని ఓ ఏసీపీకి మామూళ్లు ముట్టచెప్పినట్లు సమాచారం. వీటితోపాటు కృష్ణలంక భ్రమరాంబపురంలోని విజయ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వెనుక ఒక బిల్డింగ్‌, పక్కన మరో బిల్డింగ్‌పై నిబంధనలకు విరుద్ధంగా అదనపు ప్లోర్‌ నిర్మించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ కార్పొరేటర్‌ బంధువు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమ్మక్కై భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఇదే ప్రాంతంలో అన్నమ్మ పేరంటాలు గుడి వద్ద, స్వర్గపురి రోడ్డులో, పాత్‌ పోస్టాఫీస్‌ రోడ్డులో ఇష్టారాజ్యంగా అనధికారిక భవనాలు నిర్మిస్తున్నారు. కృష్ణలంక బాలాజీనగర్‌ 1వ రోడ్డులో అనధికారికంగా భవనం నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యనారాయణపురం, భవానీపురం, సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కూడా అనధికారిక భవన నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img