Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతిపక్షాలపై ఉక్కుపాదం

అమిత్‌షా పర్యటనతో అడుగడుగునా ఆంక్షలు
పార్టీ కార్యాలయాలకు, నేతల ఇళ్లకు నోటీసులు
తిరుపతిలో పోలీసు రాజ్యం

విశాలాంధ్ర బ్యూరో- తిరుపతి : తిరుపతి నగరం పోలీసు వలయంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా ఖాకీల బూట్ల చప్పుడు…ప్రజాస్వామ్యం ఖూనీ…రాజ్యాంగ విలువలు హరించేలా పోలీసులు కర్కశం. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగుతుంది. సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒక రోజు ముందుగానే శనివారం తిరుపతి చేరుకున్నారు. దీంతో రెండు రోజులు ముందుగానే తిరుపతి నగరాన్ని పోలీసులు జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన హక్కులు, నిధులు ఇవ్వడంలో విఫలమైన అమిత్‌షాకు తిరుపతి సమావేశంలో పాల్గొనే నైతిక హక్కు లేదంటూ విపక్షాలు నినదించాయి. హక్కుల కోసం తిరుపతిలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించాయి. దీంతో పోలీసులు స్వామిభక్తిని చాటుకునేందుకు నడుంబిగించారు. తిరుపతిలో ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాలకు నోటీసులు అంటించారు. ప్రతిపక్షాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరించి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13,14 తేదీలలో అమిత్‌ షా పర్యటన ఉన్నందున మీరు ఎవరు ఇళ్ల నుండి, కార్యాలయాల నుండి బయటకు రాకూడదని, నిరసనలు వ్యక్తం చేయకూడదని పోలీసులు హుకుం జారీ చేశారు. రాజ్యాంగం ద్వారా సాధించుకున్న ఆర్టికల్‌ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను తెలియజేస్తుంది. పోలీసులు దీనికి తూట్లు పొడిచారు. రాచరిక వ్యవస్థను తలదన్నేలా కేంద్రప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యానికి పాతర వేస్తోంది. పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అమిత్‌షా పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి తీరుతామని స్పష్టంచేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img