Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అవినీతి అదానీకి భూ కేటాయింపులా?

. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై సీపీఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలు నేడు
. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో అధికార దాహం
. ఎమ్మెల్సీ ప్రచార సభల్లో కడప ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి
. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం బ రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : లక్షల కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయిన అదానీకి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేయడం సిగ్గుచేటని, అదానీ బోగస్‌ కంపెనీల భారీ అవినీతి బాగోతంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతామని వెల్లడిరచారు. విజయవాడలోని దాసరిభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం జగన్‌ అదానీకి తొత్తులా వ్యవహరిస్తూ ప్రజా సంపదను దోచిపెడుతూ అక్రమంగా ప్రభుత్వ భూములను, పోర్టులను అప్పగిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో మోదీ ప్రజల్ని మభ్యపెట్టేలా ప్రసంగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అదానీ కంపెనీలకు సంబంధించి లక్షలాది కోట్ల అవినీతిపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే, దానిపై మోదీ మాట్లాడకుండా యూపీఏ హయాంలో జరిగిన అవినీతిని గుర్తుచేస్తున్నారన్నారు. వాస్తవంగా యూపీఏ హయాంలో అవినీతి జరిగిందనీ, దానిపై అప్పటి ప్రధాని, ప్రభుత్వాలు స్పందించాయని, చాలా మందిపై కేసులు పెట్టాయని, తీహార్‌ జైలుకు సైతం పంపాయని గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ హయాంలో ఆయనకు మిత్రునిగా ఉన్న ఆదానీ బోగస్‌ కంపెనీలతో లక్షలాది కోట్ల రూపాయలు కూడబెట్టారని, దానిపై నివేదిక ఇస్తే ప్రపంచమంతా విస్తుపోతోందన్నారు. ఆదానీ కంపెనీల్లో షేర్లు పెట్టిన వారంతా ఘోరంగా నష్టపోయారనీ, దానిపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే మోదీ ఒక్కమాటా మాట్లాడకుండా దాటవేశారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై మోదీని ప్రశ్నిస్తే దేశంపైనే దాడి జరిగినట్లుగా వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మూడేళ్లలో రూ.10 లక్షల కోట్ల సంపద ఆదానీ దగ్గరకు ఏ రకంగా వచ్చిందో చెప్పాలని మోదీని ప్రశ్నించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసేందుకు ప్రధాని ఎందుకు అంగీకరించడం లేదనీ, దానిపై సమగ్ర విచారణ చేపట్టకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా ఆదానీ అంశాన్ని చర్చిస్తుంటే…సీఎం జగన్‌ మూర్ఖుడిలా వ్యవహరిస్తూ ఆయనకు సహకరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అనంతపురం నుంచి విశాఖ వరకు సర్వం ఆదానీకే అప్పగిస్తున్నారన్నారు. పోర్టులు, సోలార్‌ ప్రాజెక్టులు ఆదానీకే కట్టబెట్టారనీ, ఇంకా ఏర్పాటుకాని డేటా సెంటర్‌కూ భూములను జగన్‌ ప్రభుత్వం కేటాయించిందని విమర్శించారు. విశాఖ, అనంతపురంలలో విలువైన భూములను ఆదానీకి అతి తక్కువధరకు అప్పగిస్తున్నారన్నారు. మోదీ మెప్పు కోసం, ఆయన మిత్రుడైన ఆదానీకి ఊడిగం చేసేందుకు రాష్ట్రంలో సీఎం జగన్‌ పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ఆదానీకి ఇప్పించడంలో జగన్‌ ఉపయోగపడ్డారని, బ్రోకర్‌గా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి బ్రోకర్‌గా వ్యవహరించే వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా అవసరమా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, అదానీ ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చామని, ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను భ్రష్టు పట్టిస్తున్న జగన్‌
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులకు సంబంధించినవేనని, అవి రాజకీయాలకు అతీతంగా జరిగేవని రామకృష్ణ అన్నారు. గతంలో సీఎంలుగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుతోపాటు ఎవరున్నా ఈ ఎన్నికలపై అంత జోక్యం ఉండేది కాదనీ, పూర్తిగా భాగస్వామ్యం అయ్యేవారు కాదనీ గుర్తుచేశారు. సీఎం జగన్‌ మాత్రం అన్నీ నాకే కావాలనే అహంకారంతో…ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు సైతం తమవారే ఉండాలనే అధికార దాహంతో వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటప్పుడు నిజాయితీగా గెలిచేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డిని ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని కడప ఆర్జేడీగా పూర్తి స్థాయిలో ఇన్‌చార్జ్‌గా వేశారని తెలిపారు. గుంటూరు డిప్యూటీ డీఈవో సుధాకర్‌రెడ్డితోపాటు మిగిలిన అధికారులను కలుపుకుని ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఎన్నికల సభలు పెడుతున్నారని చెప్పారు.
అధికారులు స్వయంగా సభలు పెట్టడం ఏమిటని నిలదీశారు. పైపెచ్చూ దొంగ ఓటర్లను పెద్దఎత్తున చేరుస్తున్నారని, వైసీపీ వెస్ట్‌ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా ప్రైవేట్‌ పాఠశాల(కడప)లో వాస్తవంగా 12 మంది పనిచేస్తుంటే, ఓటరు జాబితాలో మాత్రం 57మంది ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. బయట వ్యక్తులనూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల జాబితాలో చేర్చారన్నారు. దొంగ ఓట్లను ఆమోదించని అనంతపురం, నెల్లూరు డీఈవోలను నిర్థాక్షిణ్యంగా ప్రభుత్వం బదిలీ చేసిందని, అక్కడ ఉపాధ్యాయులకు బహుమతులు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదనేదీ అందరికీ తెలుసనీ, సీఎంగా జగన్‌ ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగబోవనీ పునరుద్ఘాటించారు. కనీసం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అయినా స్వేచ్ఛగా వదిలేయవచ్చుకదా? అని అన్నారు. లేదంటే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలకూ ఎన్నికలు జరగకుండా, వాటిని రద్దు చేసి కార్పొరేషన్ల మాదిరిగా నామినేట్‌ చేయాలని జగన్‌కు హితవు పలికారు. అధికారులు బహిరంగంగా సమావేశాలు నిర్వహిస్తుంటే…ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకనీ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఉపాధ్యాయ సంఘాలూ ఫిర్యాదు చేశాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ అపహాస్యం చేస్తున్నారనీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే…అందుకు ప్రతిఫలంగా ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్‌ సీటు ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిసిందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లోనూ జగన్‌, అధికారులు జోక్యం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ప్రతాప్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదే రకంగా వ్యవహరిస్తే కోర్టునూ ఆశ్రయిస్తామని, తప్పకుండా అక్కడ తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img