Friday, April 26, 2024
Friday, April 26, 2024

కార్మికుల సమస్యలపై చర్చిద్దాం

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణతో అనర్థం
సార్వత్రిక సమ్మెను పట్టించుకోరా?
సమ్మెకు విపక్షాల సంపూర్ణ మద్దతు
పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీలు

న్యూదిల్లీ: కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మె పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. కార్మికుల సమస్యలపై తక్షణమే చర్చించాలని విపక్షసభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రజల జీవితాలు, జీవన విధానం తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల సమ్మెకు విపక్ష సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్మికుల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రెండు రోజులుగా కార్మికులు, రైతులు కొనసాగిస్తున్న సమ్మె అంశాన్ని విపక్ష ఎంపీలు మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. కార్మిక సంఘాల డిమాండ్లపై చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు జీరో అవర్‌లో ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశంపై కొంతమంది సభ్యులు నోటీసు ఇచ్చారు. వీటిని కూడా చైర్మన్‌ నిరాకరిస్తూ ఆర్థికబిల్లుపై చర్చ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావించండని ఎంపీలకు సూచించారు. అయితే, సార్వత్రిక సమ్మెకు సంబంధించిన అంశంపై మాట్లాడటానికి ముగ్గురు సభ్యులకు వెంకయ్యనాయుడు అనుమతిచ్చారు.
సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం మాట్లాడుతూ కార్మికవర్గం చేపట్టిన సమ్మెను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఈ సభకు ఉందని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారని, అందువల్ల ఈ అంశంపై చర్చించాల్సిన బాధ్యత లేదా కర్తవ్యం ఈ సభకు ఉందని పేర్కొన్నారు. దీనిపై చర్చించడానికి ప్రభుత్వం ఏదో ఒక సమయం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ దేశ ప్రజల జీవితాలు, జీవన విధానం ప్రమాదంలో పడ్డాయని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు శక్తిసిన్హ గొహిల్‌ మాట్లాడుతూ కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి సానుకూల దృక్పథంతో కార్మిక నేతలతో చర్చించాలని సూచించారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి మోదీ సర్కారు విధానాలపై కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయని, ఉపాధి కూలీల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయని గొహిల్‌ చెప్పారు. మరో కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేశ్‌ మాట్లాడుతూ వాస్తవంగా కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖపై సోమవారమే చర్చించాలని, దీనిని మంగళవారం నాటి జాబితాలోకి ఎందుకు మార్చారని నిలదీశారు. దీనికి చైర్మన్‌ స్పందిస్తూ కార్మికుల సమస్యలపై సభ్యులు చర్చించడానికి వీలుగా మార్చినట్లు తెలిపారు.
మోదీ సర్కారు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై చర్చించాలని లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సౌగతారాయ్‌ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు అపూర్వ స్పందన లభించిందని, మోదీ ప్రభుత్వ విధానాలపై ప్రజల అసంతృప్తి ప్రతిబింబించిందని సౌగతారాయ్‌ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఇష్టానుసారం అమ్మేస్తోందని, కేంద్రం ప్రైవేటీకరణ విధానాలపై ప్రజల అసంతృప్తిని ప్రభుత్వం అర్థంచేసుకోవాలని హితవు పలికారు. ఆ అంశంపై సభలో చర్చకు అనుమతించాలని విన్నవించారు. కేంద్ర కార్మిక సంఘాలకు ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు మినహా కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాయని, జాతీయ వనరులను అడ్డగోలుగా విక్రయించడాన్ని నిరసిస్తూ ఆ సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయని చౌదరి చెప్పారు. కొత్త కార్మిక చట్టాలు, మోదీ సర్కారు ప్రైవేటీకరణ విధానాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతనాల జాప్యంపై ఆగ్రహంతో చేపట్టిన సార్వత్రిక సమ్మెపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు సభను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని చౌదరి ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలు సమ్మెలో పాల్గొన్నారని, కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా మమత ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img