Friday, April 26, 2024
Friday, April 26, 2024

దర్జాగా కబ్జా!

కొల్లేరు సరస్సు 5వ కాంటూర్‌లో కహానీయే వేరయా

. అడ్డూఅదుపూ లేని అక్రమ ఆక్వా సాగు
. దురాక్రమణలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు
. ఏడాదికి కోట్లలో ఆదాయం
. నిద్రావస్థలో అధికార యంత్రాంగం

(విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి`విజయవాడ)
ఒకప్పుడు ప్రకృతి అందాలకు ఆలవాలమైన కొల్లేరు సరస్సు…ఇప్పుడు ఓ గతం..ఓ ఊహ మాత్రమే! పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నట్లుగా కొల్లేరు సరస్సును చూడటానికి పర్యాటకలు ఎన్నో ఆశలతో అక్కడకు వెళ్తే…కన్పించేది ఓ కాల్వ తరహా నీటిగుంట. అక్కడికి వెళ్లి వచ్చిన ఏ ప్రకృతి ప్రేమికుడైనా భగ్నహృదయంతో తిరిగి రావాల్సిందే. కబ్జాకారుల దురాశ, దుర్నీతి, దురాక్రమణవాదం కొల్లేరుకు ఈ దుస్థితిని తీసుకువచ్చింది. ప్రపంచంలో అతి ఆక్రమణలకు గురైన మంచినీటి సరస్సు ఏదైనా ఉందా అంటే అది కొల్లేరు సరస్సు మాత్రమే. కొల్లేరు కొలతలను కాంటూర్లుగా నిర్ధారిస్తారు. కానీ ఏ కాంటూరులో అడుగుపెట్టినా…ఆక్రమణల పర్వమే కన్పిస్తోంది. ముఖ్యంగా 5వ కాంటూరు ఏరియా తీరే వేరు. అది ‘ఆగడాల గుట్ట.. అక్రమాల పుట్ట’. అంగబలం, ఆర్థిక బలం, అధికార బలం ఉంటే చాలు… ఏ పని అయినా చిటికెలో చేసేయ్యొచ్చు అనడానికి పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని లక్ష్మీపురం, ఆగడాల లంక కొల్లేరు ప్రభుత్వ భూములలో ఆక్వా సాగు ఒక చక్కని ఉదాహరణ. అడ్డూఅదుపూ లేని ఆక్రమణలు జరిగినా ఇక్కడ అడిగేవాడు లేడు. ఇక్కడొక ఆసామి ఉన్నాడు. అతను ఏకంగా 600 ఎకరాలను చేపల చెరువులా మార్చేశాడు. పర్యావరణానికి ఇంతకన్నా ఎక్కువ తూట్లు పొడిచేవాళ్లు సామ్రాజ్యవాద దేశాల్లోనూ ఉండరేమో! చేపల చెరువు దగ్గర అతను అడుగుపెడితే…రాజరాజ రాజమార్తాండ…దివ్యతేజ..మహారాజ..అని అనుయాయులు పొగడాల్సిందే. రొయ్యల మీసాలు తిప్పి తన మీసాలు తిప్పుకున్నట్లు భావించుకునే నకిలీ రాజసం ఆయనది. దేవుడు ‘సగం వరమే’ ఇచ్చాడన్నట్లుగా కన్పించే ఆగడాల లంకకు చెందిన ఈ బడాబాబు అక్రమార్జన కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో వచ్చి కొల్లేటి సరస్సులో సుమారు ఆరు వందల ఎకరాల భూమిని చేపల చెరువులుగా మార్చి సంవత్సరానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని తన సొంత ఖజానాకు తరలిస్తూ ఉంటాడని చెప్పుకుంటారు. ఇక తన కార్లలో సంచులకొద్దీ నోట్ల కట్టలు తరలిపోతూ ఉంటాయి. అందులో కొన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలకు, ఇంకొన్ని ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్తాయి. ఇంత జరుగుతున్నా…స్థానిక అధికారులకు చీమచిటుక్కుమన్నట్లుగా కూడా అన్పించదు. ఎందుకంటే, ఇంతకుమించిన క్యాష్‌పార్టీలు వారికి ఇంకెక్కడా దొరకరు.
ఏమాటకామాట… వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొల్లేటి సరస్సును కాపాడే దృఢనిశ్చయంతో కొల్లేరులో సముద్రాన్ని తలపించేలా ఉన్న చేపల చెరువులన్నింటినీ ధ్వంసం చేశారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆక్రమణలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరచూపి మరలా కొల్లేరులో చేపల చెరువుల తవ్వకాలు విస్తృతం చేశారు. నాలుగేళ్లక్రితం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొల్లేరు అనేది దాని అజెండాలోనే లేకుండా పోయింది. కబ్జాదారులు ఏ స్థాయికి దిగజారారంటే, చేపల చెరువు దగ్గరకు నేరుగా కారులో పోయేందుకు ఏకంగా రోడ్డునే వేసేశారు. చెరువు వద్దకు చేరుకునేందుకు రాజమార్గం లాంటి రహదారిని ఏర్పరిచినా..అధికార యంత్రాంగానికి అది నేటికీ కన్పించకపోవడం దురదృష్టకరం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎవరైనా తీసుకువెళ్తే..‘మాకు కన్పించని రోడ్డు మీకెలా కన్పిస్తుందయ్యా’ అని వేళాకోలంగా మాట్లాడుతూ ఉంటారు. అంతటితో ఆగకుండా ప్రధాన కబ్జాదారు ఈ రోడ్డు వెంబడి ఒక ఎలక్ట్రికల్‌ లైన్‌ వేసి తన సత్తా ఏంటో చూపాడు. కొన్ని రోజులకు ఎలక్ట్రికల్‌ లైన్‌ తొలగించారు. కానీ ఆక్వా సాగుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ‘ఆగడాల’ను అడ్డుకునేందుకు అధికారులు కానీ, ప్రజాపతినిధులు కానీ సాహసం చేయకపోవడం విచిత్రం. ఈ విషయంపై ఎవరు నిలదీసినా దళితులను అడ్డం పెట్టుకుని తమను ఎదిరించే వారిపై తప్పుడు కేసులు బనాయించడం ఈ 5వ కాంటూరు ఆక్రమణల వ్యవహారంలో పరిపాటిగా మారింది. ఇంకో విచిత్రమేమిటంటే, ఈ ఆక్రమణలను తొలగించాలని, చేపల చెరువులను ధ్వంసం చేయాలని గ్రీన్‌ట్రిబ్యునల్‌, కోర్టు తీర్పులిచ్చాయి. అవేవీ అధికారులకు పట్టడం లేదు.
పూర్వకాలంలో కొల్లేరు ప్రాంతంలో ఉన్న వేలాది కుటుంబాలు కొల్లేటిలోని చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు. నేడు కబ్జాదారులు ఆక్రమించి చేపల చెరువులు తవ్వడంతో కొల్లేరు ప్రజల జీవనోపాధి కష్టతరంగా మారిపోయింది. వీరిలో ఎక్కువమంది ఈ కబ్జారాజుల వద్ద కూలీలుగా మారిపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. ఇంకొందరు పొట్టచేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. కొల్లేరులో ఆక్వా సాగుతో సముద్రాన్ని తలపించే చెరువులు గోచరిస్తూ ఉంటాయి. మంచినీరు మొత్తం కలుషితమైపోయింది. ఆ నీరు తాగిన పక్షులు చనిపోతుంటాయి. వాటి కళేబరాలు నీటిలో తేలుతూ దర్శనమిస్తాయి. ప్రభుత్వ భూములను, వలస పక్షులను సంరక్షించవలసిన ప్రభుత్వ అధికారులే బడాబాబులకు దాసోహమై అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లేరు సరస్సుకు పూర్వవైభవాన్ని అందించాలని, తిరిగి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, కొల్లేరు తీరప్రాంతవాసులు వలసబాట పట్టకుండా కాపాడాలని, బడాబాబుల చెర నుంచి కొల్లేరు భూములను కాపాడి చెరువులను ధ్వంసం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే సమయం మించిపోయింది. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, కొల్లేరు ప్రజలు కచ్చితంగా ఉద్యమబాట పడతారనేది నిస్సందేహం. అంతేగాకుండా, విజయవాడకు చెందిన ఓ సామాజిక, పర్యావరణ బృందం కొల్లేరు సరస్సు తాజా పరిస్థితిపై ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారోద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img