Friday, April 26, 2024
Friday, April 26, 2024

న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరిగింది

ఆశిశ్‌ మిశ్రా బెయిల్‌ రద్దుపై బాధిత కుటుంబాల హర్షం
లక్నో : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన లఖింపూర్‌ ఖేరీ హింస కేసులో కీలక నిందితుడైన ఆశిశ్‌ మిశ్రా బెయిల్‌ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బాధిత రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. అలహాబాద్‌ హైకోర్టు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడైన ఆశిశ్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఆ ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలు సుప్రీంలో సవాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆ బెయిల్‌ రద్దవడం, ఆశిశ్‌ జైలులో లొంగిపోవడం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆశిశ్‌ మిశ్రాకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని బాధిత కుటుంబాలు వ్యాఖ్యానించాయి. కోర్టు తీర్పు విన్న అనంతరం దేశంలో ఇంకా చట్టబద్దమైన పాలన ఉందని తాను భావించినట్టు లఖింపూర్‌ ఘటనలో మృతి చెందిన రైతు గుర్విందర్‌ సింగ్‌ తండ్రి సుఖ్వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ దేశం గూండాలది కాదు అని సుప్రీంకోర్టు ఆ తీర్పు ద్వారా స్పష్టం చేసినట్టు భావిస్తున్నానని తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని చెప్పారు. ఆశిశ్‌ మిశ్రాకు హైకోర్టులో బెయిల్‌ దొరకడం రైతులను బాధకు గురి చేసిందని ఆనాటి ఘటనలో మృతి చెందిన రైతు సుఖ్వీందర్‌ సింగ్‌ సోదరుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ అన్నారు. మిశ్రా స్వేచ్చగా తిరగడం అన్నదాతలందరికీ చెంపపెట్టుగా భావించామని, అయితే సుప్రీంకోర్టు అతడి బెయిల్‌ను రద్దు చేయడంతో న్యాయం పట్ల విశ్వాసం పెరిగినట్టు తెలిపారు. నియంతల పాలనలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తామంతా సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరు 3న చోటుచేసుకున్న లఖింపూర్‌ ఖేరీ ఘటనలో నలుగురు అన్నదాతలు, ఒక జర్నలిస్టు సహా ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img