Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెట్టుబడులొచ్చేనా?

జీఐఎస్‌కు విశాఖ ముస్తాబు

. రేపు, ఎల్లుండి పెట్టుబడిదారుల సదస్సు
. 26 దేశాల నుంచి 5 నుంచి 8 వేల మంది అతిథులు
. రూ.100 కోట్లతో నగరంలోని రహదారుల సుందరీకరణ
. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ప్రధాన వేదికలు

విశాలాంధ్ర- విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖ పట్టణం వేదికగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్‌) కు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం నాటికి ప్రధాన వేదికలన్నింటిలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. గురువారం సాయంత్రం నాటికి అన్ని ప్రధాన వేదికలూ అందుబాటులోకి వచ్చేస్తాయని సంబంధిత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ డా. ఎ.మల్లిఖార్జున తెలిపారు. సదస్సు నిర్వహణలో భాగంగా రూ.100 కోట్లతో నగరంలోని రోడ్లను సుందరీకరిస్తున్నామని వెల్లడిరచారు.
26 దేశాల నుంచి అతిరథ మహారథులు
సదస్సుకు 26 దేశాల నుంచి అతిథులు, పెట్టుబడిదారులు విచ్చేస్తున్నారు. ఈ మేరకు నగరంలో ఉన్న అనేక హోటళ్లలో 750కు పైగా గదులను ఇప్పటికే కేటాయించారు. అలాగే మరో వెయ్యి వరకు ప్రైవేటుగా కొంతమంది గదులను బుక్‌ చేసుకున్నారు. అతిథులను ఆయా హోటళ్ల నుంచి ప్రధాన వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు నోడల్‌ ఆఫీసర్లను, ప్రత్యేక సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ అధ్వర్యంలో ఇప్పటికే నియమించారు. అలాగే అతిథులు బస చేసే హోటళ్ల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. అతిథుల్లో కొంతమంది ప్రత్యేక విమానాల్లో విశాఖపట్టణం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. మరికొంత మంది ప్రత్యేక హెలికాప్టర్లలో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. ముఖ్యమంత్రి దిగేందుకు, ఇతర హెలికాప్టర్లు దిగేందుకు సంబంధిత ఏర్పాట్లు ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరుగుతున్నాయి.
ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
కళాశాల మైదానంలో పెట్టుబడిదారులు వచ్చే ప్రధాన ప్రవేశం వద్ద రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. అందులో 40 డెస్కులను ఏర్పాటు చేశారు. అందుకు తగ్గ నోడల్‌ అధికారులను, సిబ్బందిని కేటాయించారు. ఈ మేరకు బుధవారం నుంచే రిజస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు పరిశ్రమల శాఖ ఈడీ చెప్పారు. 1, 2వ తేదీల్లో స్థానికంగా ఉన్న పెట్టుబడుదారుల నుంచి వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే ప్రత్యేక కిట్‌ అందజేస్తామని వివరించారు. అనంతరం వారికి కేటాయించిన స్టాలు, హాలును తెలియజేస్తారని వెల్లడిరచారు.
4 వేల మంది అతిథులకు డైనింగ్‌ ఏరియా
ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రూపుదిద్దుకుంటున్న ప్రధాన వేదికల్లో డెలిగేటెడ్‌ డైనింగ్‌ ఏరియా ఒక్కటి. ఇక్కడ సుమారు 4 వేల మంది కూర్చొని భోజనం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నామని పరిశ్రమల శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న అతిథులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల మెనూలూ తయారు చేయిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఆంధ్ర ప్రదేశ్‌ సంప్రదాయ వంటకాలను కూడా చేయిస్తున్నామన్నారు.
చర్చలు… సెమినార్లకు సకల ఏర్పాట్లు
ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూపుదిద్దుకుంటున్న వేదికల్లో మూడవది… అన్ని రకాల కంపెనీలకు, సదస్సులకు చెందిన సెమినార్లు నిర్వహించేందుకు ఉద్దేశించినది. ఇక్కడ అన్ని దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, పెట్టుబడిదారులు చర్చలు సాగిస్తారు. అధికారికంగా సెమినార్లు నిర్వహిస్తారు. ఎంవోయూలు, పెట్టుబడి ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటారు. దీనికి సమీపంలో ఉన్న ప్రధాన సెమినార్‌ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సదస్సు ఉద్దేశాలను తెలుపుతూ ప్రారంభోపన్యాసం చేసి మొదటి రోజు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధాన హాలు వద్ద కూర్చునేందుకు ఏర్పాట్లు, సుందరీకరణ పనులు ప్రత్యేక నిపుణుల అధ్వర్యంలో జరుగుతున్నాయి.
ఏపీ పెవిలియన్‌ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌
ముఖ్యమంత్రికి కేటాయించిన ప్రత్యేక వేదికకు సమీపంలో ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో మద్దిలపాలెం వైపు సుమారు 137 స్టాళ్లతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో స్టార్టప్‌ జోన్‌లు, కంట్రీ ఎరినా, రెన్యువబుల్‌ ఎనర్జీ, హ్యాండ్‌లూమ్స్‌`టెక్స్‌టైల్స్‌, పర్యాటకం, ఆటో, ఏక్రో స్పేస్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా, హెల్త్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, లాజిస్టిక్స్‌, అగ్రికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పోర్టు ఇండస్ట్రీస్‌, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ పరిధిలో నడిచే కంపెనీలు, ఏపీఐఐసీ పరిధిలో ఉండే కంపెనీలు, గ్రామ సచివాలయాలు, పాఠశాల విద్య, పట్టణ ప్రణాళిక, పంచాయతీ రాజ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర అంశాలు ప్రదర్శనలో ఉంటాయి.
సభా స్థలంలోనే సీఎంకు ప్రత్యేక బస
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉండేందుకు సభా ప్రాంగణంలోనే ప్రత్యేక బస ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్‌ సమినార్‌ హాలుకు అనుసంధానంగా ఈ వేదికను రూపొందిస్తున్నారు. ఇక్కడే ముఖ్య అతిథులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా వేచి ఉంటారు. సదస్సుకు సంబంధించిన వివరాలు అందించేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఉండే వేదికలోనే మీడియాకు ప్రత్యేక స్థలం కేటాయించనున్నారు. మీడియా వారికి సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియా బ్రీఫింగ్‌ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, భోజన ఏర్పాట్లు, సెమినార్లు, ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులు, ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అతిథులకు ఎంవీఎస్‌ మూర్తి ఆడిటోరియం రోడ్డు నుంచి సాధారణ పెట్టుబడిదారులకు, ఇతర అధికారులకు ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహాల సముదాయాల వద్ద మెయిన్‌ గేటు ఏర్పాటు చేశారు. మెయిన్‌ గేటులో నుంచి లోపలికి వచ్చిన వారిని తనిఖీ చేసిన అనంతరం రిజస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. అధికారులతో పాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లకు చెందిన ప్రైవేటు వ్యక్తులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేపీఎంజీ, సీఐఐ, ఈడీబీ తదితర సంస్థలతో పాటు టైమ్స్‌ నౌ సంస్థ కూడా ఏర్పాట్లలో భాగస్వామ్యం అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img