Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

బీజేపీది దిగజారుడు రాజకీయం

ఎన్నికల సమయంలో డేరాబాబాకు పెరోలా ?
రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్రాలు విఫలం
ప్రజా ఉద్యోమాలతో జగన్‌లో ఉలికిపాటు
నేడు అనంతలో కరవు, వరద బాధితులతో రణభేరి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అధికార బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఓబులేశు, పి.హరినాథ్‌రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారా లకు పాల్పడి, జర్నలిస్టును హత్య చేసి శిక్ష అనుభవిస్తున్న హంతకుడు డేరా బాబాను పంజాబ్‌ ఎన్నికల సమయంలోనే పెరోల్‌పై హరియాణ బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం సిగ్గుచేటని, దీనికి తోడు ఆయనకు జెడ్‌ ఫ్లస్‌ కేటగిరీ భద్రత కల్పించడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు తార్కాణమని విమర్శించారు. అధికారం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని పేర్కొన్నారు. లౌకిక, ప్రజాతంత్ర వాదులు, ప్రజలంతా దీనిని ఖండిరచాలని కోరారు. సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రజా ఆందోళనలకు ఉలికిపాటు పడుతోందని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సమస్యలపై ఆందోళనకు చేపడితే వారిని అణచివేస్తూ, అక్రమ నిర్భందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పైగా వారి వెనుక ఎల్లో అజెండా ఉందంటూ ప్రభుత్వ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయడాన్ని ఖండిరచారు. జగన్‌కు చంద్రబాబు దయ్యమై పట్టినట్లున్నారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఆయన వైఖరిలో ఏమీ మార్పులేదన్నారు. అంగన్‌వాడీలు, ఆశాలకు తెల్లకార్డులు ఇవ్వాలని, పదవీ విరమణ తర్వాత ఫించన్‌ ఇవ్వాలని, తెలంగాణ ప్రభుత్వం తరహాలో వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్లపై ఆందోళనకు దిగితే తప్పా ? అని ప్రశ్నించారు. అవన్నీ ప్రభుత్వం తలచుకుంటే, తేలికగా పరిష్కరించేవేనని అన్నారు. సమస్యలను గుర్తించకుండా ఏదేదో ఊహించుకుని మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వివిధ వర్గాల సమస్యలు నిత్యం చర్చకు వస్తున్నా రైతాంగ సమస్యలపై చర్చలు లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోతే, ఇప్పటివరకు లెక్కలు చూపలేదని, ఒక్క అనంతపురం జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా ఆ వివరాలను సేకరించలేదని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి శంకరనారాయణ తన సొంత నియోజకవర్గమైన పెనుగొండలో కేవలం 65 ఎకరాల్లో మాత్రమే పంట నష్టానికి గురైనట్లు తేల్చారన్నారు. కేంద్ర బృందం వచ్చి, చూసి వెళ్లినా ఫలితాలు శూన్యమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లోనూ రైతాంగానికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తుచేశారు. పంట నష్టంపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ గురువారం ‘కరవు, వరద బాధితుల రణభేరీ’ పేరిట అనంతరపురంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, వివిధ రైతు సంఘాల నేతలు హాజరవుతారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు మాట్లాడుతూ అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు న్యాయమైన కోర్కెల కోసం ఉద్యమబాట పడితే, దాని వెనుక ఎల్లో అజెండా ఉందంటూ ప్రభుత్వం ఎదురు దాడికి దిగడం తగదన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో అంగన్‌వాడీలు ఉద్యమించగా, వారిని గుర్రాలతో తొక్కించిన సంఘటనలున్నాయని, ఏపీలోనూ వివిధ ఉద్యమాల నేపథ్యంలో లాఠీఛార్జీ జరిగిన ఘటనలున్నాయని గుర్తుచేశారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ కార్మిక పక్షమేనని, దీనిపై జగన్‌ అనవసరపు దుష్ప్రచారం చేయడం వల్ల ఆయనకే నష్టమని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్‌ ప్రభుత్వం పైకి తీర్మానించి, లోపల మాత్రం కేంద్రంతో కుమ్మకవుతోందని విమర్శించారు. దామోదరం సంజీవయ్య విద్యుత్‌ ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం సమర్ధవంతమైన వారికి లీజుకిస్తున్నామంటూ అదానీకి కట్టబెట్టిందన్నారు. దీంతో తమ ప్రభుత్వానికి సమర్ధత లేదనే విషయాన్ని వారే చెప్పుకున్నట్లైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్‌కు చేతనైతే పద్ధతిగా పరిపాలన చేయాలని, లేకుంటే వారి బాధ్యతలను ఇతరులకు అప్పగించి పక్కకు తప్పుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img