Friday, April 26, 2024
Friday, April 26, 2024

మంత్రి మిశ్రాను తొలగించాలి

లఖింపూర్‌ ఖేరీ హత్యలపై దద్దరిల్లిన లోక్‌సభ
విపక్ష సభ్యుల నిరసనల నడుమ సభ వాయిదా

న్యూదిల్లీ : లఖింపూర్‌ ఖేరీ హత్యలపై లోక్‌సభ బుధవారం దద్దరిల్లింది. రైతులతో సహా ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్‌ ఖేరీ హింసాకాండతో సంబంధం ఉన్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేయడంతో లోక్‌సభ కార్యకలాపాలు బుధవారం వాయిదా పడ్డాయి. హింసాకాండపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కనుగొన్న విషయాలపై వార్తాపత్రిక కధనాలను చూపుతూ ప్రతిపక్ష సభ్యులు సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. లఖింపూర్‌ ఖేరీ హత్యలపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, ఇతర ప్రతిపక్ష సభ్యులు సమర్పించిన వాయిదా తీర్మానం నోటీసులను ఆమోదించాలని కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. సభ కార్యకలాపాలు సజావుగా జరిగేలా అనుమతించాలని వారిని కోరారు. ‘సమస్యలను లేవనెత్తడానికి సభ్యులకు నేను ఎప్పుడూ తగిన సమయం ఇస్తాను. మీరు (నిరసన సభ్యులు) ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇది సభకు గౌరవం కాదు. మీకు చర్చలు అక్కర్లేదా’ అని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోవిడ్‌`19 మహమ్మారిని ప్రస్తావిస్తూ, వెల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించేలా ప్రతిపక్ష సభ్యులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేయడానికి ముందు సభలో గందరగోళం ఉన్నప్పటికీ, నాలుగు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలను ఉదయం 11.30 గంటల వరకు చేపట్టారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలే పునరావృతమయ్యాయి. అధ్యక్ష స్థానంలోఉన్న బీజేపీ సభ్యుడు రాజేంద్ర అగర్వాల్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ నిరసనలు కొనసాగాయి. సభాకార్యక్రమాలను నిలిపివేయాలంటూ స్పీకర్‌కు కొన్ని నోటీసులు అందాయని, అయితే వాటన్నింటిని ఆయన అనుమతించలేదని అగర్వాల్‌ తెలిపారు. ’కూర్చోండి, ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ జరుగుతోంది. ఇది మీ డిమాండ్‌. ఈ అంశంపై సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. దయచేసి మీ స్థానాల్లోకి వెళ్లండి’ అని అగర్వాల్‌ ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అన్నారు. అయితే సభలో గందరగోళం నెలకొనడంతో బుధవారమంతా లోక్‌సభ వాయిదా పడిరది. అక్టోబర్‌ 3న నలుగురు రైతులు సహా 8 మంది మరణానికి కారణమైన లఖింపూర్‌ ఖేరీ హింసాకాండలో 13 మంది నిందితులలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కూడా ఉన్నారని వాదిస్తూ ప్రతిపక్ష సభ్యులు మంత్రి మండలి నుండి అజయ్‌ మిశ్రాను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img