Friday, April 26, 2024
Friday, April 26, 2024

మంత్రి మేకపాటి హఠాన్మరణం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి/హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కుప్పకూలిన గౌతమ్‌ రెడ్డిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనను బతికించడానికి విశ్వ ప్రయత్నం చేసిన వైద్యులు ఉదయం 9.16 నిమిషాలకు మృతి చెందినట్లు ప్రకటించారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా దాదాపు గంటన్నరపాటు వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చికిత్స అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి ఆదివారం సాయంత్రమే హైదరాబా ద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై అనేక సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పారిశ్రామికవేత్త, మాజీఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. గత నెల 22న కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు.
సీఎం దిగ్భ్రాంతి…వెంటనే హైదరాబాద్‌కి పయనం
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాలోమన్‌ ఆరోకియా రాజ్‌, రేవు ముత్యాలరాజు, ధనుజంయ్‌ రెడ్డిలతో ముఖ్యమంత్రి తన నివాసంలో సమావేశమయ్యారు. గౌతమ్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయమంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడిని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్ధంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారని సీఎం అన్నారు. రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వలభవిష్యత్తు ఉన్న నాయకుడ్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌ రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికే తీరని లోటన్నారు. వెంటనే ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.
రెండు రోజులు సంతాప దినాలు
మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంతో రెండు రోజులపాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. సంతాప సూచకంగా అసెంబ్లీ, సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎంవో కార్యాలయంపై ఉన్న జాతీయ పతాకాలను అవనతం చేశారు. సంతాప దినాలుగా ప్రకటించడంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఈనెల 22న నిర్వహించ తలపెట్టిన జగనన్న తోడు మూడో విడత సాయం అందజేత కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు.
మేకపాటి కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం
మరణవార్త వినగానే సతీమణి భారతితో కలిసి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్‌ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసానికి చేరుకుని మేకపాటి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కన్నీటి పర్యంతమవుతున్న మేకపాటి తండ్రి రాజమోహన్‌ రెడ్డి, ఆయన సతీమణిని జగన్‌ ఓదార్చారు. గౌతమ్‌ రెడ్డి తల్లి జగన్‌ను కౌగిలించుకుని గుక్కపెట్టి రోదించారు. ధైర్యంగా ఉండాలని మేమంతా కుటుంబానికి అండగా ఉంటామని, మేకపాటి మృతి వ్యక్తిగతంగా తనకే గాక, పార్టీకి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.
నేడు భౌతికాయం స్వగ్రామానికి తరలింపు ` రేపు అంత్యక్రియలు
మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. ఆయన కుమారుడు అర్జున్‌ రెడ్డి అమెరికాలో ఉన్నారు.
నేరుగా మంగళవారం సాయంత్రానికి చెన్నయ్‌ చేరుకుని అక్కడ నుంచి నెల్లూరు వస్తారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img