Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

మూడో దశ ముంగిటే..

‘4టీ’.. ఆరోగ్య మౌలికాభివృద్ధి కీలకం
నిశిత నిఘా.. జనసమూహాల నివారణ ముఖ్యం
కరోనా కట్టడికి శీఘ్ర చర్యలు అవశ్యం
ఆరు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచనలు

భారత్‌ కొవిడ్‌ మూడవ దశ ముంగిట ఉందని, పొంచివున్న ఈ ముప్పు నివారణకు శీఘ్రంగా కచ్చితమైన చర్యలను అమలు చేయాలని ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సూచించారు. కొవిడ్‌ దశలవారీ విజృంభణ నిరోధానాకి యుద్ధప్రాతిపదికన ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చుకోవాలన్నారు. టెస్ట్‌, ట్రాక్‌్‌, ట్రీట్‌, టీకా (4టీ) సూత్రాన్ని తూ.చా తప్పకుండా పాటించాలని సూచించారు. కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించారు. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 80శాతం, అలాగే 84 శాతం మరణాలు ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉండటంతో వీటిపై మోదీ దృష్టి పెట్టారు. కేరళ, మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితే కొవిడ్‌ రెండవ దశ ప్రారంభానికి ముందు అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎదురైందని ప్రధాని గుర్తుచేశారు. ఈ క్రమంలో మూడవ దశ మరింత వినాశకరంగా పరిణమించే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. వైరస్‌ శరవేగంగా రూపాంతరం చెందుతుండటంతో కఠిన పర్యవేక్షణ, అన్ని రకాల వేరియంట్లు, వాటి ప్రభావంపై నిశిత సమీక్షలు అవసరమని అన్నారు. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, టీకా విషయంలో అలసత్వం వద్దని సూచించారు. మైక్రో కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జనసమూహాలను నివారించాలని, అందుకోసం నిశిత పరిశీలన, అప్రమత్తత, కచ్చిత వైఖరి అవసరమని మోదీ సూచించారు. ఇప్పటికే యూరప్‌, అమెరికా దేశాలతో పాటు బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, థాయిలాండ్‌, మియన్మార్‌ దేశాలలో వైరస్‌ కరాళనృత్యం కొనసాగుతోందని, ఈ పరిస్థితి భారత్‌తో సహా యావత్‌ ప్రపంచానికి హెచ్చరిక అని మోదీ అన్నారు. కొవిడ్‌ కట్టడి కోసం రూ.23వేల కోట్ల అత్యవసర ప్యాకేజిని ఇచ్చామని, ఆ నిధులను సద్వినియోగించుకోవాలని, ఆరోగ్య రంగంలో మౌలికాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. కొత్త ఐసీయూలు, ఐసీయూ పడకలు, పరీక్షల సామర్థ్యం పెంచుకోవాలని అన్నారు. ఈ ఆరు రాష్ట్రాలకు 332 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు కేటాయించగా 53 ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మిగతా ప్లాంట్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రలకు సూచించారు. పిల్లలకు వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ అన్నారు. సమావేశంలో హోంమంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొన్నారు.
తమిళనాడుకు కోటి వాక్సిన్‌లు కావాలి : స్టాలిన్‌
తమిళనాడు రాష్ట్రానికి కొవిడ్‌ వాక్సిన్‌ల కేటాయింపు చాలా తక్కువగా ఉందని, కనీసం మరో కోటి టీకాలు కావాలని ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. కొవిడ్‌ మహమ్మారి కట్టడికి సంబంధించిన అన్ని వస్తువులపై జీఎస్టీని మినహాయించాలని కోరారు. నీట్‌ వంటి పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని, వీటి వల్ల వైరస్‌ వ్యాప్తి ముప్పు లేకపోలేదని స్టాలిన్‌ అన్నారు. మహమ్మారి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీనిస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరా, రెమ్‌డెసివిర్‌ కేటాయింపును పెంచినందుకు కేంద్రానికి స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img