Friday, April 26, 2024
Friday, April 26, 2024

వచ్చేది కురుక్షేత్ర యుద్ధం

వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం
రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఏపీని కాపాడుకుందాం
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు
గోదావరి తీరం పసుపుమయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వచ్చేది కురుక్షేత్రమేనని, ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను చిత్తుగా ఓడిరచి శాసన సభను గౌరవ సభగా మార్చి అసెంబ్లీకి వెళదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు తమ్ముళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావడంతో గోదావరి తీరం పసుపుమయంగా మారింది. తొలుత మహానాడు వేదికపై ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ నేతలు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రతినిధుల సభను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ఈ మహానాడు ప్రత్యేకమైనదని, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాన్ని కూడా కలిపి నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్‌ అని, అలాంటి మహానాయకుడికి మనం వారసులమన్నారు. రాజమహేంద్రవరం ఎన్టీఆర్‌ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీసాంప్రదాయాలకు రాజమహేంద్రవరం వేదిక. నన్నయ… ఇక్కడే నడయాడాడు… కందుకూరి వీరేశిలింగం ఇక్కడే పుట్టాడు. ఇక్కడే కాటన్‌ నివసించాడు… ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చాడు. కాటన్‌ చేసిన సేవలకు గాను ప్రతి ఊళ్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆయనకు దక్కిన గౌరవమన్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని చంద్రబాబు విమర్శించారు. 2019లో ఏపీ ఆదాయం రూ.66,786 కోట్లు కాగా తెలంగాణది రూ.69,620 కోట్లని తెలిపారు. అదే 2022-23 నాటికి తెలంగాణ ఆదాయం రూ.1.32 లక్షల కోట్లు అయితే ఏపీ ఆదాయం కేవలం రూ.94,916 కోట్లు మాత్రమేనన్నారు. ఆనాడు సమానంగా ఉన్న ఆదాయం జగన్‌ పాలనతో తగ్గిందని, అది కూడా దాదాపు 40 శాతం అధికంగా తెలంగాణ ఆదాయం ఉందన్నారు. జగన్‌ విధ్వంస పాలనతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మళ్లీ కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధిని ఆపేశారు. అమరావతి, పోలవరం పూర్తయితే ఏపీ కూడా కళకళలాడేది. అనుభవం లేని వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. పేదలను మరింత నిరుపేదలను చేస్తున్నారు. నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదు. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగుదేశం కార్యకర్తలు నిలబడ్డారు. మీ అందరి త్యాగాలకు సెల్యూట్‌ చేస్తున్నా. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా. భవిష్యత్‌లో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు. సంపద సృష్టించడమే కాదు… పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ. ఏపీలో సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే తెలుగుదేశం. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు రూ.50 హార్స్‌ పవర్‌ విద్యుత్‌ ఇచ్చాం. దేశంలో మొదటి సారి పేదలకు పెన్షన్‌ ఇచ్చిన పార్టీ టీడీపీ. 2014లో రూ.200 పెన్షన్‌ ఉంటే రూ.2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014 తరువాత వందల సంఖ్యలో పథకాలు అమలు చేశాం. హైదరాబాద్‌ నగరాన్ని మనమే అభివృద్ది చేశాం. విభజన తరువాత 2029 నాటికి ఏపీని కూడా దేశంలో నంబర్‌ 1 రాష్ట్రం చేయాలని పనులు చేశాం. వ్యవసాయంలో 11 శాతం వృద్ధి రేటు సాధించాం. ఇరిగేషన్‌ పై 64 వేల కోట్లు ఖర్చు చేశాం. రూ.16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం. ఆ పెట్టుబడులు వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. 2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజల్ని నిలువునా జగన్‌ మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వం ఉంది. సీఐడీ అంటే కరప్షన్‌, ఇన్‌ ఎఫిషియంట్‌, డిస్ట్రక్షన్‌ అని విశ్లేషించారు. రివర్స్‌ టెండర్లు అన్నాడు. పరిపాలనను రివర్స్‌ చేశాడు. ప్రజా వేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టాడు. అమరావతికి మనం రూపం ఇస్తే దాన్ని విధ్వంసం చేశాడు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం లేదు. అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వ్యక్తి జగన్‌ రెడ్డి. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవి. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదు. జగన్‌ చెప్పిన జాబ్‌ క్యాలెండర్‌ లేదు… జాబ్స్‌ లేవు. దిశ చట్టం అన్నాడు. లేని చట్టం పేరుతో రాజమండ్రిలో పోలీస్‌ స్టేషన్‌ పెట్టాడు. ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలని, 25 మందిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని… ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. అమ్మఒడి ఒక నాటకం. నాన్న బుడ్డి వాస్తవం. ఎన్నికల సమయంలో మద్య నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి. మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడని చంద్రబాబు తీవ్రస్థాయిలో సీఎం జగన్‌ పాలనాతీరుపై ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ 1గా మార్చే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందని, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికులా పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తదితరులు ప్రసంగించారు. ధరలు, పన్నులు, చార్జీల బాదుడే బాదుడు, బీసీ ద్రోహి జగన్‌ రెడ్డి, సంక్షోభంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమం తదితర అంశాలపై పార్టీ ముఖ్య నేతలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాజకీయ తీర్మానాన్ని సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img