Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖ ఉక్కు రక్షణకు మహోద్యమం

. ప్రత్యక్షపోరులో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి
. ఒక్క పరిశ్రమ పెట్టలేని ప్రధాని 26 సంస్థలను తెగనమ్మారు
. సీబీఐకి భయపడి జగన్‌ పొర్లు దండాలు బ దిల్లీ దద్దరిల్లేలా 30న విశాఖ మహాగర్జన
. ముగిసిన సీపీఐ, ఏఐటీయూసీ మూడు రోజుల దీక్షలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ ప్రత్యక్ష పోరులో రాజకీయాలకతీ తంగా ప్రజలంతా భాగస్వాములు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం రెండేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రిలేదీక్షలు బుధవారం ముగిశాయి. దీనిలోభాగంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగిన దీక్షా కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న కుట్ర పూరితమైన ప్రకటన చేసిందని గుర్తు చేశారు. రెండేళ్లుగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని, వారికి సంఫీుభావంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో అదిలాబాద్‌ నుండి అనంతపురం వరకు, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘ పోరాటం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నష్టాల్లో ఉన్న పరిశ్రమలను మాత్రమే ప్రైవేట్‌పరం చేసేవారని, అందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును సైతం కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు తయారైందని మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెపుతున్న సీఎం జగన్‌ కేంద్రానికి భయపడుతూ పొర్లు దండాలు పెడుతున్నారని విమర్శించారు. మోదీ గత 8 ఏళ్ళ కాలంలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను నెలకొల్పలేక పోగా, 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేశారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 30వ తేదీన విశాఖలో జరగనున్న కార్మిక మహాగర్జనకు దిల్లీ దద్దరిల్లేలా లక్షలాదిమంది ప్రజలు తరలిరావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జగదీశ్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌ గౌడ్‌, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు: జేవీఎస్‌ మూర్తి
అనేకమంది త్యాగాల ఫలితంగా ఏర్పాటై, లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నం చేస్తుంటే సీఎం జగన్‌ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి నిలదీశారు. విశాఖ జీవీఎంసీ విగ్రహం ఎదుట నిరసనదీక్షా శిబిరం ఏర్పాటు చేయగా, టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు పి.మణి, సీపీఐ ఎంఎల్‌(ఎన్‌డి) వై.కొండయ్య, సీపీఐ ఎంఎల్‌ నాయకులు అడారి అప్పారావు, విశాఖ ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్‌ డి.ఆదినారాయణ తదితరులు మద్దతు తెలియజేశారు. ఈ శిబిరాన్ని నాగార్జున యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య బాలమోహన్‌ దాస్‌, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య కేఎస్‌ చలం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా ప్రజలంతా సమైక్యంగా ఉద్యమించి విశాఖ ఉక్కును కాపాడుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు సంఫీుభావ దీక్షకు అధ్యక్షత వహించారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధం: జల్లి విల్సన్‌, రవీంద్రనాథ్‌
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌్‌ స్పష్టం చేశారు. విశాఖ ఉద్యమానికి సంఫీుభావంగా బాపట్లలో సీపీఐ, ఏఐటీయూసీ అధ్వర్యాన నిర్వహించిన దీక్షా శిబిరాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ ప్రారంభించారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేశారు. లాభాల్లో నడుస్తున్న పరిశ్రమను ప్రైవేటీకరించడం దుర్మార్గమని, దీనిని కాపాడుకునేందుకు ప్రజలు మరోసారి త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ విశాఖలో జరిగే మహాగర్జనకు కేంద్రానికి కనువిప్పు కలిగేలా ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని రవీంద్రనాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బత్తుల శామ్యూల్‌, షేక్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు: ఓబులేసు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు హెచ్చరించారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన నిరసన దీక్షా శిబిరం నిర్వహించారు. ఓబులేసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ 3.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించి, ప్రస్తుతం 7.3 మిలియన్‌ టన్నులకు చేరుకుందన్నారు. దాదాపు 30వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కును కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. దీనిపై వైసీపీ ఎంపీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, ఎన్టీఆర్‌ జిల్లా సీపీఐ కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి కొండలరావు, విజయవాడ కార్యదర్శి మూలి సాంబశివరావు, డీహెచ్‌పీఎస్‌ అధ్యక్షులు కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మోదీ సేవలో జగన్‌: హరినాథరెడ్డి
ఏపీకి తీరని అన్యాయం చేస్తూ పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న నరేంద్రమోదీని సీఎం జగన్‌ కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు పి.హరినాథరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మోదీ సేవలో పరితపించడం మానుకొని…విశాఖ ఉక్కును కాపాడేందుకు చొరవ చూపాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తిరుపతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కె.కుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, సీపీఐ నగర కార్యదర్శి జె.విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
చావో రేవో తేల్చుకుందాం: ఈశ్వరయ్య
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకపోయినా, సొంత గనులు కేటాయించకపోయినా, ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద జరిగిన సామూహిక నిరసన దీక్షలో ఈశ్వరయ్య మాట్లాడుతూ 30న విశాఖలో లక్షమందితో ‘‘కార్మిక మహాగర్జన’’ను జయప్రదం చేయడం ద్వారా జగన్‌, మోదీలను ఇంటిదారి పట్టించాలని పిలుపిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పీవీఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
అదానీకి కట్టబెట్టేందుకు మోదీ కుట్ర: డేగా ప్రభాకర్‌
విశాఖ ఉక్కు పరిశ్రమను అదానీ కంపెనీకి కట్టబెట్టడానికి మోదీ కుట్ర పన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు డేగా ప్రభాకర్‌ మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మగా మోదీ మారారని, దేశం లోని ప్రభుత్వ రంగ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని విమర్శించారు. ఎన్నో ప్రాణత్యాగాలు, పోరాటాలు, ఉద్యమాలు ద్వారా వచ్చిన విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో కె.సత్తిబాబు, పెద్దిరెడ్డి రాము, వాసంశెట్టి సత్తిరాజు, మోకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులో
చిత్తూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు నిర్వహించిన దీక్షల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎ.రామానాయుడు, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, సహాయ కార్యదర్శి టి.జనార్థన్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టి.కోదండయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో
ఏలూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన దీక్షలో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో
భీమవరం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన దీక్షలో పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, చెల్లుబోయిన రంగారావు, కలిశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్‌ రంగరాజు, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలో
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ హుస్సేన్‌, కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి బాబురావు, షేక్‌ సుభాని తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో
కాకినాడ ఆర్డీవో కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ(పిఎస్‌) అధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img