Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

విహారం… విషాదం

. సముద్రంలో నలుగురు విద్యార్థుల గల్లంతు
. ఒకరి మృతదేహం లభ్యం
. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఘటన

విశాలాంధ్ర ` బాపట్ల : విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారిన దుర్ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో గురువారం చోటు చేసుకుంది. గుంటూరులోని జీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఏడుగురు రామాపురం బీచ్‌కు వచ్చారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల తాకిడికి నలుగురు విద్యార్థులు గల్లం తయ్యారు. గల్లంతైన వారిలో మహాదేవ్‌ అనే యువకుడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురాగా… తెనాలికి చెందిన యడవల్ల రమణ, పులివర్తి గౌతమ్‌లతోపాటు గుంటూరుకు చెందిన తాళ్లూరి రోహిత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒడ్డుకొచ్చిన మృతదేహం హైదరాబాద్‌కు చెందిన తిరుణగిరి మహాదేవ్‌గా పోలీసులు గుర్తించారు. వీరందరూ గుంటూరు జీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గల్లంతైనవారితో పాటు పొదిలికి చెందిన కసిరెడ్డి మనోహర్‌రెడ్డి, కడప జిల్లా బద్వేల్‌కు చెందిన నాగరౌత్‌ ఖలీల్‌, తెనాలికి చెందిన షేక్‌ రవూఫ్‌ మొత్తం ఏడుగురు స్నేహితులు గురువారం మధ్యాహ్నం సమయంలో వేటపాలెం ఓడరేవు బీచ్‌ వద్ద ఉన్న సీ బ్రీజ్‌ రిసార్ట్‌ సమీపంలో సముద్రంలోకి దిగారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఏడుగురులో నలుగురు విద్యార్థులు (యడవల్ల రమణ, తాళ్లూరి రోహిత్‌, తిరుణగిరి మహాదేవ్‌, పులివర్తి గౌతమ్‌) ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో భయాందోళనకు గురైన మిగిలిన విద్యార్థులు పరుగున వెళ్లి దగ్గర్లో ఉన్న మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చేపట్టారు. దీంతో మహాదేవ్‌ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ముగ్గురి కోసం మృత్స్యకారులు, వేటపాలెం ఎస్సై జనార్ధన్‌ తన సిబ్బందితో తీవ్రంగా సముద్రంలో గాలింపు చేపట్టినా మిగతావారి ఆచూకీ తెలియరాలేదు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకృష్ణమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించి డీఎస్పీకి శ్రీకాంత్‌కు సహాయ చర్యలు ముమ్మరం చేయాలి సూచించారు.
కన్నీటి సాగరం : బాపట్ల జిల్లాలోని సముద్రపు బీచ్‌ల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు విహార యాత్రికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శెలవులు వచ్చాయంటే సముద్రతీరం శోకసంద్రంగా మారుతోంది. ఇసుక తిన్నెలపై కేరింతలు కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు సముద్ర తీరంలో విగత జీవులుగా కనిపిస్తూ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నారు. జిల్లాలో 15 రోజుల వ్యవధిలో గురువారం జరిగిన ఘటన రెండోది. ఈ నెల 5వ తేదీన విజయవాడకు చెందిన ఆరుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతై విగత జీవులుగా బయటకు వచ్చారు. బాపట్ల జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా ఉన్న సముద్ర తీరం 74 కిలోమీటర్ల మేర విస్తరించింది. సూర్యలంక, ఓడరేవు, రామాపురం, కొత్త ఓడరేవు, పాండురంగాపురం, దిండి, మోటుపల్లి బీచ్‌లు ప్రముఖంగా ఉన్నాయి. ఏటా సుమారు 25 లక్షల మంది సందర్శకులు సముద్రతీరానికి విహార యాత్రలకు వస్తుంటారు. ఈ జిల్లా నుంచి పర్యాటక శాఖకు ప్ర ఏటా రూ. 5 కోట్లు ఆదాయం వస్తుంది. అదే విధంగా ప్రైవేటు ఆతిథ్య రంగాల వారు రూ.12 కోట్ల మేర ఆదాయం గడిస్తున్నారు. ఏటా పర్యాటకులు పెరుగుతున్నా ప్రభుత్వం పర్యాటకుల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం శోచనీయం. తీరంలో పర్యాటకులకు సరైన సౌకర్యాలు కల్పించగ పోగా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రధానంగా తీరం వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. సాంకేతికతతో సముద్ర స్థితిగతులను తెలిపే ఏర్పాటు ఊసే లేదు. దీంతో ఎక్కడ నుంచో సరదగా గడిపేందుకు సముద్ర తీరానికి వస్తున్న ఎంతో మంది ప్రత్యేకించి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత సముద్ర అలల దాటికి మృత్యు ఒడిలోకి చేరి తల్లిదండ్రులకు కన్నీటిని మిగల్చుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం జిల్లాలో ఉన్న బీచ్‌ల్లో సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఆయా ప్రదేశాలలో నెలకొల్పాలి. దీంతో పాటు తీరంలో ప్రతి బీచ్‌లో గజ ఈతగాళ్లను నియమించటంతో పాటు ఎప్పటికప్పుడు మైక్‌ ద్వారా సముద్రంలో దిగిన వారిని హెచ్చరిస్తూ… బైనాక్యూలర్‌ ద్వారా వారి కదలికలను పర్యవేక్షిస్తూ లోతుకు వెళ్లే వారి హెచ్చరించి మరోసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img