Friday, April 26, 2024
Friday, April 26, 2024

సెషన్స్‌ కోర్టులోనే విచారణ

మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి నారాయణపై నమోదు చేసిన టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ కేసుకి సంబంధించి చిత్తూరు సెషన్స్‌ కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సూచించింది. సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంటూ పిటీషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం ముగించింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్‌ హైస్కూలులో 2022 ఏప్రిల్‌ 27న పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. వాట్సాప్‌ద్వారా ఆ ప్రశ్నాపత్రం బయటకు రావడం వెనుక నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ పాత్ర ఉన్నట్లు చిత్తూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై నారాయణ తరపు న్యాయవాదులు నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఆయన 2014లోనే వైదొలగారని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసిందని కోర్టులో వాదించి ఆయనను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ పొందారు. అప్పటినుంచి ఈ కేసుపై ప్రభుత్వం అప్పీళ్లకు వెళుతుండడంతో జిల్లా కోర్టు, హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ఇటీవల హైకోర్టు నారాయణ బెయిల్‌ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈకేసును సెషన్స్‌ కోర్టు విచారించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img