Friday, April 26, 2024
Friday, April 26, 2024

9 నుంచి ఉద్యమం

సీఎస్‌ జవహర్‌రెడ్డికి నోటీసు అందజేత
సీఎం హామీలు అమలు కాలేదు: బొప్పరాజు, దామోదరరావు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఏపీ జేఏసీ అమరావతి పోరాటానికి సమాయత్తమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకుగాను మార్చి 9 నుంచి దశలవారీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసును ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, నేతలు ఫణి పేర్రాజు, వీవీ మురళీకృష్ణనాయుడు మంగళవారం అందజేశారు. 11వ పీఆర్సీపై గతేడాది ఫిబ్రవరిలో ఉద్యమం జరిగిన సందర్భంగా సీఎం, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్ల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దశలవారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు నోటీసులో స్పష్టంచేశారు. అనంతరం బొప్పరాజు, దామోదరరావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగసంఘ నాయకులకు స్వయంగా సీఎం జగన్‌ ఇచ్చిన హామీలే అమలు కానప్పుడు తామెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతభత్యాలకు కేటాయించిన బడ్జెట్‌ ఏమవుతుందో తెలియడం లేదన్నారు. తమ డబ్బులు ఎవరికి మళ్లిస్తున్నారని, ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఎందుకీయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, కొత్త డీఏ, సెలవు డబ్బులు తదితర అర్థిక అంశాలపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఉద్యమంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా తాము బాధ్యులం కాదన్నారు. మార్చి 1న ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల మద్దతు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 2 నుంచి 5వ తేదీ వరకు 26 జిల్లాలలో ఉద్యమానికి ఉద్యోగులను సన్నద్ధం చేసేందుకు అన్ని సంఘాలతో విస్తృతస్థాయి సమావేశాలు జరుపుతామన్నారు. 9, 10 తేదీలలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో ఆందోళనలు చేపడతామన్నారు. 15 నుంచి 20 వరకు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 21న ఒక రోజు సెల్‌డౌన్‌ చేపట్టి, వర్క్‌ టు రూల్‌ ప్రారంభిస్తామని వివరించారు. 24న అన్ని ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 27న కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు, ఏప్రిల్‌ 1వ తేదీన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తామని వివరించారు. 3వ తేదీన చలో కలెక్టరేట్‌ ద్వారా స్పందనలో వినతిపత్రాలు ఇస్తామని, 5వ తేదీన రాష్ట్రకార్యవర్గ సమావేశం, రెండో విడత భవిష్యత్‌ కార్యాచరణ, కీలక నిర్ణయాలపై ప్రకటన చేస్తామన్నారు. ఈసారి చాయ్‌, బిస్కెట్‌ సమావేశాలతో రాజీపడబోమని నొక్కిచెప్పారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్‌
దశల వారీ ఉద్యమ కార్యాచరణ నోటీసుపై ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ…ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, ప్రభుత్వంపై ఉద్యోగులంతా నమ్మకం ఉంచుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img