Friday, April 26, 2024
Friday, April 26, 2024

అప్పుల మంత్రి బుగ్గన

ఏపీ అప్పులు తక్కువా?
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు విడ్డూరం
పోలవరం నిర్వాసితులపై జగన్‌ నిర్లక్ష్యం
ఉచిత కరెంటు ఎత్తివేతకు కుట్ర
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు

విశాలాంధ్ర`తిరుపతి: కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులు చాలా తక్కువని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 32.4 శాతం మాత్రమే అప్పులు చేసిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆర్థికమంత్రి కాదని, ఆయన అప్పుల మంత్రిగా మారారని విమర్శించారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు, కార్పొరేషన్ల ద్వారా సేకరించిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అప్పులు, వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం ప్రకటించడానికి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులను జగన్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం డబ్బుల్వికుపోతే తామేమీ చేయలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోతే…ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా చేసిన ఘనత జగన్‌ కే దక్కుతోందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి అవకాశం గల పోలవరం ప్రాజెక్టు…రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనమన్నారు. ఇలాంటి ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ముంపు బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేవలం 2000 రూపాయలు ఇవ్వడం దారుణమన్నారు. మానవతా దృక్పథంతో పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని సీఎం జగన్‌ పదేపదే చెప్పడం ద్వారా ఆయన మెడకు ఉరితాళ్లు బిగించుకోవడానికి సిద్ధపడినట్లేనని రామకృష్ణ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల అమలుకు సీఎం జగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కరెంటు వినియోగం తగ్గుతుందని కథలు చెప్పి మోదీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. మీటర్లపై రైతులలో వ్యతిరేకత లేదని చెబుతున్న ప్రభుత్వం… అనంత జిల్లాలో తమ పర్యటనను ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌ పథకానికి మంగళం పాడేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, కార్యవర్గసభ్యులు ఎ.రామానాయుడు, తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్‌, నదియా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img