Friday, April 26, 2024
Friday, April 26, 2024

మే 28,29 తేదీల్లో రాజమహేంద్రవరంలో
టీడీపీ మహానాడు

. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా 100 సభలు నిర్వహణ
. వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు
. టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎన్టీఆర్‌ శతజయంతి సందర్బంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లో మొత్తం 100 సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ (టీడీప)ీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలను ఈ నెల 30 నుంచి ప్రారంభించి మహానాడు నాటికి ముగించాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ తీర్మానించింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 17 కీలక అంశాలకు సంబంధించి చర్చించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 4 అంశాలున్నాయి. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడుని ఈసారి రాజమహేంద్రవరంలో మే 28,29 తేదీల్లో ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఎన్నికల మ్యానిఫెస్టోని భిన్నంగా రూపొందించేందుకు కసరత్తు నిర్వహించాలని, ఆర్థిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా మ్యానిఫెస్టో రూపకల్పన చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చిన భారీమార్పులను ఈ సమావేశం విశ్లేషించుకుంది. ఏప్రిల్‌ ఆఖరి వరకూ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూప కల్పన రూపొందించారు. నవంబర్‌లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పోలిట్‌ బ్యూరో భావించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్‌, లీడర్‌లకు దిశానిర్దేశం చేసింది. పార్టీ సభ్యత్వంలో జీవితకాల (లైఫ్‌ టైమ్‌) సభ్యులను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు 5 వేల రూపాయలు రుసుముగా పోలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల విజయంపై విశ్లేషణ చేసింది.
టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన మూడు స్థానాల్లో వైసీపీ ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ప్రభావితం కాలేదని, ఇదే చైతన్యాన్ని ఓటర్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించేలా పార్టీ నాయకత్వం కృషి చేయాలని పొలిట్‌ బ్యూరో భావించింది. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణాన్ని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించింది. ఈసమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, రెండు రాష్ట్రాలకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img