Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు.. సీఎం జగన్‌ నివాళులు, జెండా ఆవిష్కరణ

జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు. దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని ట్వీట్‌ చేశారు. మరోవైపు పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జరిగే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్‌ పాల్గొన్నారు. అలాగే చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్‌ శాఖ ఆవిష్కరించనుంది. పింగళికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నివాళులు అర్పించారు. భారతావని స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న శుభవేళ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అంటూ ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరేసేందుకు దేశం పిలుపునివ్వడం తెలుగు జాతికి పింగళి వెంకయ్య గారు సాధించిపెట్టిన గౌరవం అన్నారు. భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగుజాతి కీర్తి కెరటం పింగళి వెంకయ్య గారి 146వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించారు. జాతీయోద్యమంలోనే కాకుండా, విద్య, శాస్త్రీయ రంగాలలోనూ దేశానికి సేవలందించిన పింగళి వారి బహుముఖ సేవలను, దేశభక్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img