Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పెరిగిన పేదరికం…

మోదీ హయాంలో అసమానతలు

న్యూదిల్లీ : భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా మారుతోందని పాలకులు చెప్పుకొస్తున్నప్పటికీ, దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయని అనేక విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కాషాయ పార్టీ బీజేపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ఆహార పదార్ధాల పై జీఎస్‌టీ విధింపు, నిరుద్యోగం సమస్య వంటివి ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెడుతున్నాయి. పాలకులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలు చేయకుండా అధికార కాంక్షతో మతోన్మాద చర్యలకు పూనుకుంటున్నారు. దేశంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం పై దృష్టి పెట్టలేదు. కొత్త పరిశ్రమలను స్థాపించకపోగా, ఉన్న పరిశ్రమలను బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను సైతం నిర్వీర్యం చేస్తున్నారు ఇదే క్రమంలో, ప్రపంచంలో భారతదేశం ప్రపంచంలోని పేదల అత్యధిక కేంద్రీకరణను కలిగి ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2020లో 159.8 మిలియన్ల నుంచి 192.8 మిలియన్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖ అంచున ఉన్నారని అంచనా. ప్రపంచంలో భారతదేశంలో పేదరికం అత్యధిక స్థాయిలోనే ఉందన్నది సుస్పష్టం. భారతదేశంలో పేదరికం, అసమానత అధికారిక అంచనాలు నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌), గృహ వినియోగదారుల వ్యయ సర్వే (సీఈఎస్‌) ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి 1950ల మధ్య నుంచి 2011-12 వరకు దాదాపు అందుబాటులో ఉన్నాయి. సీఈఎస్‌, నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌ఏఎస్‌)ని ఉపయోగించి వినియోగ పోకడల మధ్య వ్యత్యాసం వంటి సమాచార నాణ్యత సమస్యలను ఉటంకిస్తూ 2017-18 సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. సీఈఎస్‌ గృహ-స్థాయి సమాచారం పై ఆధారపడి ఉండగా, స్థూల స్థాయిలో ప్రైవేట్‌ వినియోగాన్ని అంచనా వేయడానికి ఎన్‌ఏఎస్‌ వస్తు ప్రవాహం విధానాన్ని ఉపయోగిస్తుంది. స్థూల చిత్రం తరచుగా సూక్ష్మ స్థాయి వాస్తవాలను దాచిపెడుతుంది. నాలుగు దశాబ్దాలలో మొదటిసారిగా, వాస్తవ పరంగా సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం (ఎంపీసీఈ) 2011-12లో రూ.1,501 నుంచి 2017-18లో రూ.1,446కి 3.7 శాతం క్షీణించిందని నివేదికలు సూచించాయి. ఇది భారతదేశంలో పేదరికం పెరిగిందని సూచిస్తుంది. పట్టణ భారతదేశంలో (2.2 శాతం) తో పోలిస్తే గ్రామీణ భారతదేశంలో (8.8 శాతం) క్షీణత తీవ్రంగా ఉంది. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ నినాదం చేస్తున్న కేంద్ర పాలకులకు ఈ నివేదిక కచ్చితంగా ఇబ్బంది కలిగించేదే. 2011-12 నుంచి అధికారిక అంచనాలు లేనందున, ప్రజలు అంతర్జాతీయ లేదా జాతీయ సంస్థలు, పరిశోధకుల అంచనాల పై ఆధారపడుతున్నారు. కొన్ని అధ్యయనాలు పేదరికం తగ్గుదలని సూచిస్తుంటే, మరికొన్ని 2014 తర్వాత పెరగడాన్ని సూచిస్తున్నాయి. అయితే ఒక అధ్యయనం ప్రైవేట్‌ తుది వినియోగ వ్యయం పై 2011-12 సీఈఎస్‌ సమాచారం ఆధారంగా వినియోగ ధోరణుల ఆధారంగా 2020-21 వరకు అధికారిక పేదరిక అంచనాలను వివరించడానికి ప్రయత్నించింది. దేశంలో పేదరికం, అసమానత తీవ్రంగా ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img