Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

వరవరరావును లొంగిపోమనండి

బోంబే హైకోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి
ముంబై : ఎల్గార్‌ పరిషత్‌` మావోయిస్టుల లింకు కేసులో నిందితుడు, విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయని, అందువల్ల ఆయనను జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశించాలని బోంబే హైకోర్టుకు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వరవరరావుకు హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఇంటివద్దే ఉంటున్నారు. వరవరరావు ఆరోగ్యాన్ని నానావతి ఆసుపత్రి వైద్యుల బృందం పరిశీలించిందని, ఆయనకు వైద్యం కొనసాగించడం లేదా ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిందని జస్టిస్‌ నితిన్‌ జాందార్‌, జస్టిస్‌ ఎస్‌వీ కోత్వాల్‌లతో కూడిన ధర్మాసనానికి ఎన్‌ఐఏ తరపున న్యాయవాది సందేశ్‌ పాటిల్‌ చెప్పారు. బెయిల్‌ రావడానికి ముందు వరవరరావు నవీ ముంబైలోని తలోజా జైలులో ఉన్న విషయం విదితమే. ‘వరవరరావు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు ఈ కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ గడువు ముగిసింది. అందువల్ల ఆయన లొంగిపోవాల్సిందే. ఆ తర్వాత వరవరరావు తరపు న్యాయవాది వాదనలను పరిశీలించవచ్చు’ అని పాటిల్‌ ధర్మాసనానికి విన్నవించారు. కాగా వరవరరావు ఆరోగ్యానికి సంబంధించిన వాస్తవిక నివేదికను సోమవారం నాటికి సమర్పించాలని నానావతి ఆసుపత్రిని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img