Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

విపక్షాలు ఒక్కటి కావాలి

మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై పోరు తప్పనిసరి
కార్యాచరణపై చర్చిస్తున్నాం
రాహుల్‌గాంధీ, శరద్‌ యాదవ్‌ ఉద్ఘాటన

న్యూదిల్లీ: బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌పై పోరుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ అనుకూల విధానాలు అనుసరిస్తున్న మోదీ సర్కారుపై విపక్షాలన్నీ కలిసి కట్టుగా పోరాడాలని యోచిస్తున్నాయి. ఆ మేరకు ఒక్కో పార్టీ బయటికి వస్తుంది. బలమైన ప్రతిపక్షంగా నిలిస్తేనే నియంతృత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిరచగలమని నమ్ముతున్నాయి. అందులో భాగంగా ఆయా పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఆర్‌జేడీ నేత శరద్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, మోదీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలపై చర్చించారు. ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతపైనా ముచ్చటించారు. సమావేశం అనంతరం శరద్‌ యాదవ్‌, రాహుల్‌గాంధీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని రాహుల్‌ అన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం అనివార్యమని శరద్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీపై పోరాటానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించగా ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి కావడం తప్పదని రాహుల్‌ అన్నారు. అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు ఎలా రావాలి? ఇందుకు అవసరమైన కార్యాచరణ ఏమిటి? దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. దేశం గురించి తాను ఆందోళన చెందుతున్నానని, సమాజంలోని బలహీన వర్గాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని శరద్‌ యాదవ్‌ అన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అవుతారా అని అడుగగా ‘ఎందుకు కాకూడదు?రాహుల్‌ 24 గంటలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం రాహుల్‌గాంధీయే కాంగ్రెస్‌ అధ్యక్షుడు కావాలి. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను అధ్యక్షుడిని చేయాలి’ అని శరద్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. దీనిపై మీరేమంటారని రాహుల్‌ను అడుగగా ‘వేచి చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. శరద్‌యాదవ్‌ను తనకు గురువుగా రాహుల్‌ అభివర్ణించారు. విద్వేష ప్రచారం పెరగడం, దేశం మతపరమైన విభజనకు గురవుతుందని, ఫలితంగా భారత్‌ ఎటో వెళ్లిపోతోందని శరద్‌ యాదవ్‌ ఆందోళన చెందుతున్నారని, ఆయన అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని రాహుల్‌ చెప్పారు. ‘మనమంతా ఈ సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. మనమంతా కలిసి దేశాన్ని సరైన మార్గంలోకి తీసుకురావాల్సి ఉంది. సోదరభావం దిశగా దేశాన్ని తిరిగి నడపాల్సి ఉంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి మతోన్మాద శక్తులపై పోరాడే సత్తా ఇంకా శరద్‌ యాదవ్‌కు ఉంది. రాజకీయాల్లో ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను’ అని రాహుల్‌ చెప్పుకొచ్చారు. దేశంలో సామరస్యం లేదు. విద్వేషం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం అదుపులో లేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌ మిత్రులకు మోదీ సర్కారు కట్టబెడుతోంది. ఈ సమస్యలన్నింటిపై ఉమ్మడి పోరాటం అనివార్యమని రాహుల్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img