Friday, April 26, 2024
Friday, April 26, 2024

మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి

ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
రమ్యశ్రీ అంతిమయాత్రలో జల్లి విల్సన్‌, కరవది సుబ్బారావు డిమాండ్‌
విశాలాంధ్ర`గుంటూరు : దేశంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో దళిత విద్యార్థిని హత్య కావడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్‌, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావులు అన్నారు. రమ్యశ్రీ అంతిమయాత్రలో పాల్గొన్న జల్లి విల్సన్‌, కరవది సుబ్బారావులు ఆమె భౌతికదేహానికి నివాళులర్పించి, ఆమె తండ్రిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్ధాలు దాటిన మహిళలకు, దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులకు అన్ని విధాలుగా రక్షణ, అభివృద్ధి జరుగుతుందని ఆశించారని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని, కర్నూలు, అనంతపురం, విజయవాడలో దళిత విద్యార్థినిలు హత్య గావించబడ్డారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన రమ్యశ్రీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలుపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తుంటే ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. పోలీసులు, ప్రభుత్వం సమన్వయంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రమ్యశ్రీ కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా యిచ్చి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నివాళులర్పించిన వారిలో దళిత సంఘం నాయకులు తిప్పాబత్తిని గోవిందు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img