Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలి


సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌


విశాలాంధ్ర`బొల్లాపల్లి : మండలంలోని గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయుచు సంవత్సర కాలం పైబడి కార్మికులకు ఇవ్వవలసిన వేతనాలను ఇవ్వకుండా రేపు మాపు అని చెబుతూ కాలం గడుపుతున్న ప్రభుత్వ అధికారులు వారి వేతనాలను వెంటనే చెల్లించాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌ ప్రభుత్వ అధికారులను దుయ్యబట్టారు. మండల కేంద్రమైన బొల్లాపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల ప్రథమ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రం చేస్తూ ఉదయం సాయంత్రం మరొక పనిచేయటానికి వీలు లేకుండా అదే జీవనముగా పనిచేయుచున్న మండలంలోని సుమారు 26 గ్రామపంచాయతీల కార్మికులకు సంవత్సరం పైబడి కొందరికి, కొంతమందికి 18 మాసాలుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని ప్రశ్నించనిదే, పోరాడనిదే పనులు కావని గ్రామీణ ప్రాంత కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకొని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నేడు సమాజం ఉన్న పరిస్థితుల్లో సామాన్య పేద కార్మికులైన గ్రామ పంచాయతీ కార్మికులు బ్రతుకు జీవనం దుర్భరమైందని పెరిగిన ధరలకు కుటుంబాలు గడవక అల్లాడిపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులపై సంకెళ్ళను బిగిస్తున్నారని హక్కులు కాపాడుకొనుటకు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కనీస వేతనం 380 జీవో ప్రకారం పంచాయతీ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వినుకొండ నియోజకవర్గ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, నూనెలు, యూనిఫారం ఇవ్వాలని పారిశుద్ధ్య పరికరాలను రిక్షాబండ్లను కొత్తవి ఏర్పాటు చేయాలని, కేంద్ర కార్మిక శాఖ ప్రకటించిన విధంగా కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మహాసభలో గ్రామీణ ప్రాంత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక:
ఏపీ గ్రామపంచాయతీ బొల్లాపల్లి మండల కమిటీ గౌరవాధ్యక్షులుగా షేక్‌ సైదా వలి, అధ్యక్షులుగా మన్నం నరసింహారావు, కార్యదర్శిగా మూడవతు రమేష్‌ నాయక్‌, సహాయ కార్యదర్శిగా భూక్య కీనా నాయక్‌, ఉపాధ్యక్షులుగా పట్రా మన్నయ్య, కోశాధికారిగా మూడావతు పెన్నా నాయక్‌, కమిటీ సభ్యులుగా మేఘావత్తు రవి నాయక్‌, మొండితోక నాగేశ్వరరావు, కందుకూరి భూషణంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో పనిచేయు గ్రామపంచాయతీ కార్మికులకు గత సంవత్సర కాలం పైబడి ఇవ్వకుండా నిలిచిపోయిన వేతనాలను వెంటనే బకాయిలతో సహా చెల్లించాలని మహాసభ తీర్మానించింది. లేనియెడల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img