Monday, May 6, 2024
Monday, May 6, 2024

సీనియెర్ జర్నలిస్ట్ మల్లాదికి జర్నలిజం పరిశోధనకు స్వర్ణ పతకం

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ఆధ్యాత్మిక పత్రికలు భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై ఎం.ఫిల్ పరిశోధన చేసిన సీనియెర్ జర్నలిస్ట్ మల్లాది వేంకట గోపాలకృష్ణకు బొప్పన్న స్మారక స్వర్ణ పతకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ తమిళిసై రంగరాజన్ చేతులమీదుగా ఆయన స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. జర్నలిజం, కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి ప్రతిపాదనలు చేసి, శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనలను నిరూపించినందుకుగాను మల్లాది పరిశోధన స్వర్ణ పతకానికి ఎంపికయ్యింది. మల్లాది సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా వృత్తిజీవితాన్ని మొదలుపెట్టి అనేక ప్రముఖ టీవీ ఛానెళ్లు, ప్రముఖ పత్రికల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసి తనదైన శైలిలో అద్భుతమైన ప్రతిభను కనపరచి యాజమాన్యాలనుండి, ప్రజలనుండి మన్ననలు అందుకున్నారు. వృత్తిజీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సమున్నతమైన శిఖరాలను చేరుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలియైన ఆయన కవి రచయిత భాషావేత్తగా, అనువాదకుడు బోధకుడిగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణిస్తున్నారు.పట్టుదల, కార్యదీక్షలకు పెట్టింది పేరైన మల్లాదిని పరిశోధనా రంగంలో, జర్నలిజం రంగంలో తొలి అడుగులు వేస్తున్న పాత్రికేయులు,పరిశోధకులు ఆదర్శంగా తీసుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగెడ కిషన్ రావ్ అభిప్రాయపడ్డారు. చేపట్టిన కార్యాన్ని కడవరకూ పట్టుదలగా నిలిపి, గెలిచే ఓపికకు నిదర్శనంగా నిలిచే వృత్తి నిపుణుడిగా మల్లాదిని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకట్రామయ్య తదితరులు అభివర్ణించారు. మల్లాది చేసిన ఎం.ఫిల్ పరిశోధన సనాతన ధర్మానికి పట్టుగొమ్మగా నిలిచేదిగా ఉందని, ఆయన మరిన్ని విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పలువురు జర్నలిస్టు మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు. రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ తెలుగు భాషలో చేసిన ప్రసంగం అందరికీ ఆకట్టుకుంది. తెలుగు భాషను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం గురించి ఆమె చక్కగా ప్రసంగించారు. పతకాలు అందుకున్న పరిశోధక విద్యార్ధినీ విద్యార్థులందరికీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్, ఇతర బోధనా సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img