Friday, April 26, 2024
Friday, April 26, 2024

రేపు విజయ్‌ మాల్యా కేసు విచారణ

న్యూదిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కార కేసులో విచారణను సుప్రీంకోర్టు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. సీనియర్‌ అడ్వకేట్‌, అమికస్‌ క్యూరీ జైదీప్‌ గుప్తా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాను బుధవారం వేరొక కేసులో వాదనలు వినిపించవలసి ఉన్నందున వాయిదా వేయాలని గుప్తా కోరారు. రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి, లండన్‌కు పారిపోయిన విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మాల్యా తన పిల్లలకు లక్షలాది రూపాయలు బదిలీ చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017లో నిర్ధారణ అయింది. ఈ కేసులో ఆయన వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరయ్యేందుకు చిట్టచివరి అవకాశం ఇచ్చింది. మార్చి 9న హాజరుకావాలని ఫిబ్రవరి 10న ఆదేశించింది. అయితే గుప్తా విజ్ఞప్తి మేరకు ఈ కేసు విచారణను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది. 2021 నవంబరు 30న విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇక ఎంత మాత్రం వేచి చూడబోమని, కోర్టు ధిక్కార వివాదంలో మాల్యాకు శిక్ష విధించే అంశాన్ని అంతిమంగా పరిశీలిస్తామని తెలిపింది. ఆయనకు విధించదగిన శిక్ష గురించి వాదన వినిపించేందుకు అవకాశం కల్పించింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరయ్యేందుకు విజయ్‌ మాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. 2021 నవంబరు 30న జారీ చేసిన చివరి ఆదేశాల్లో నిర్దిష్టంగా ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది. అమికస్‌ క్యూరీ గుప్తా మాట్లాడుతూ విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్థారించిందన్నారు. ఆయనకు శిక్ష విధించవలసి ఉందని చెప్పారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కోర్టు ధిక్కార కేసుల్లో న్యాయస్థానానికి ప్రత్యేక అధికార పరిధి ఉందన్నారు. మాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఆయన వినియోగించుకోలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img