Friday, April 26, 2024
Friday, April 26, 2024

వచ్చే ఎన్నికల్లోనూ మాదే అధికారం: రౌత్‌

ముంబై: మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాది(ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని, 2024 అసెంబ్లీ ఎన్నికల్లోను విజయం సాధించి మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం స్పష్టంచేశారు. పొరుగునున్న గోవాలో మాదిరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌రౌత్‌ స్పందించారు. బీజేపీ కలలు కంటున్నదని వ్యాఖ్యానించారు. ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ భాగస్వాములుగా ఉన్న విషయం విదితమే. ‘ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. మరో రెండున్నరేళ్లు కూడా ఇలాగే సాఫీగా మా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎన్నికలు మళ్లీ 2024లో జరుగుతాయి. అప్పుడు కూడా అధికారం చేజిక్కించుంటాం’ అని రౌత్‌ విలేకరులతో అన్నారు. ఫడ్నవిస్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా గోవా అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జిగా ఫడ్నవిస్‌ పనిచేశారని, గోవాలో బీజేపీ గెలుపు..ఫడ్నవిస్‌తో అలా మాట్లాడిరచి ఉంటుందన్నారు. అయితే, గోవాలో ఏమి జరిగిందో ఫడ్నవిస్‌కు త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. పోర్చుగీసు, బ్రిటీషు పాలకులే గోవాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని, చాలామంది రాజకీయ నాయకులకు అర్థం కాలేదని రౌత్‌ చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాలకు మంచి గుర్తింపు తెచ్చిన నాటి సంస్కృతిని బీజేపీ విధ్వంసం చేస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాట్లాడటానికి ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారని, ఇంతకుముందు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. దురదృష్టవశాత్తు అందుకు బాధ్యులు తమ బీజేపీ మిత్రులేనని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img