Friday, April 26, 2024
Friday, April 26, 2024

కవితో ఓ సాయంత్రం…

ఎలా ఉంటుంది. అనాథకు అమ్మ దొరికినట్లుగా ఉంటుంది. తిరనాళ్లలో తప్పిపోయిన బాల్యం యవ్వనమై ఎదురొచ్చినట్లుగా ఉంటుంది. శీతవేళ బంగారు రంగులో మెరిసిపోతున్న ఆకాశం కింద ఇళ్లకు మరలిపోతున్న గోమందలా ఉంటుంది. ఓ కవి ముందు కూర్చుని అతని కవిత్వమే కాదు… మాటలూ వింటూంటే కూడా అలౌకిక ఆనందమేదో ముఖాల్లో తొణికిసలాడుతుంది. కవే కాదు, కవయిత్రి అయినా, రచయితైనా, రచయిత్రి అయినా… సృజనకారుల ముందు కూర్చోవడమంటే లైబ్రరీలో శ్రద్ధగా చదువుకోవడం. ఆ కవి ఇజాలు, ఇష్టాలు, ప్రేమలు, వ్యసనాలు, ఆనందాలు, దు:ఖాలు ఏవైనా కావచ్చు. అతను లేదా ఆమె చెబుతున్న కబుర్లలో ప్రపంచమంతా కల తిరిగినట్లుగా భ్రమ కొల్పుతుంది. ఈ సత్యం తెలుసుకనుకనే మైళ్ల దూరాల నుంచి కవిత్వాభిమానులు బస్సుల్లోను, రైళ్లలోనూ, వివిధ ప్రయాణ సాధనాలద్వారా ఆ కవిని కలుసుకుందుకు వస్తారు. గంట, గంటన్నర, మహా అయితే రెండు గంటలు మాత్రమే సృజనకారులతో గడిపే సమయం ఉంటుంది. ఆ తక్కువ సమయం కోసం ఐదారు గంటలు… మరికొందరైతే పది పన్నెండు గంటల సమయాన్ని వెచ్చించి మరీ వస్తారు. ఇంత ప్రేమ ఎందుకుంటుంది. ఇంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది. ఎలా వస్తుందంటే మనం కోల్పోయినదేదో ఆ సృజన కారుడిలో దొరుకుతుంది. మనం రాయాలనుకున్నది రాయలేని సమయంలో ఆ కవిరాసింది మన కళ్ల పడుతుంది. ఇతనెవరో నాలాగే ఆలోచిస్తున్నారు. ఈమెవరో అచ్చంగా నా కలనే కంటోంది. లేదూ నా ఆలోచనలకు, కలలకు చాలా భిన్నంగా ఉన్నారు. ఇలాంటి మనిషిని చూడాలి. వారి మాటవినాలి. వారి ఆలోచనలను ఏకీభవించడమో లేదా వ్యతిరేకించడమో జరగాలి అనుకునే స్థితిలోనే కవితో సాయంత్రాలు ఉంటాయి.
అలాంటి ఓ సాయంత్రమే ఈ మధ్య కాకినాడలో జరిగింది. ఆరున్నర దశాబ్దాలపాటు తెలుగువారి మధ్యన గడిపి ఈ మధ్యనే అమెరికా వెళ్లిన కవి, సృజనకారుడు హెచ్చార్కేతో కాకినాడలో ఓ సాయంత్రం మంచి జ్ఞాపకంలా మిగిలింది. ఆ సమావేశంలో హెచ్చార్కే ఏం మాట్లాడాడు. నేటి సత్యం రేపటికి అసత్యమవ్వచ్చన్న వాస్తవాన్ని గుర్తు చేశాడు. మనుషుల గురించి తాను బెంగటిల్లుతానన్నాడు. శ్రీశ్రీ కవిత్వంలో జనజీవన చిత్రం ఉందంటూనే నేను అంగీకరించని, ఏకీభవించని మాట ‘‘శ్రీ శ్రీ మహాకవి కాదు’’ అన్నాడు. వాదులాడాడు. ఎవరూ మహాకవి కాదన్నాడు. అసలే పెద్ద పెద్ద ఎర్రకళ్లున్న కవి. వాదు లాడుతున్నప్పుడు ఆ కళ్లలో ఎర్రజీరను దాచుకోలేని వెర్రిబాగులా డయ్యాడు. అది ముగిసాక భోజనం చేస్తూ ‘‘బంగాళాదుంపల ఫ్రై బాగుంది చక్రి. ఇంకొంచెం వేసుకో’’ అని అమ్మయ్యాడు. కవులు ముఠాలుగా మారుతున్నారనే ఎరుక ఉండాలన్నాడు. అన్నట్లు నేను ఎప్పటికీ కమ్యూనిస్టునే అని ఛాతి ఉప్పొంగిస్తూ చండ్ర పుల్లారెడ్డిని స్మరించుకున్నాడు. ‘‘కలలు కనే వేళ కాదు సోదరా… ఉద్యమించు వేళ ఇదే సోదరా’’ అంటూ పాటైతే పాడాడు కాని…. కలలు కనకుండా ఎలా బతుకుతాం అని నిలువెత్తు ప్రశ్న వేశాడు. ఇక్కడా అమయాకపు కవే కనపించాడు నాకు. అసలు కలలు కనే తీరిక ఎక్కడుంది నేటి ఆధునిక సమాజానికి. కలత నిద్ర పోవడం వినా… అవును, ఇప్పుడు కంటున్న కలలన్నీ కృత్రిమమైనవి, కలత చెందే కలలే కదా అని ఆ కవికే కాదు మొత్తం సమాజానికే వినిపించేలా అరవాలనిపించింది. అది కూడా కలగానే మిగిలిపోయింది. కాని కల కనాల్సిందే. హెచ్చార్కే అన్నట్లు కలలను అలలు అలలుగా కనాల్సిందే. ఈ హెచ్చార్కే అంటాడు నిద్రకు, మెలకువకు మధ్య తనను ఏది ఆవహిస్తోందో అదే తనకు కలలో కనిపిస్తోందట. నాకు, నీకు, ఎదుటి వారికి, పక్కింటి వారికి, తెల్లనామెకు, నల్లవాడికి, బలవంతుడికి, బలహీనుడికీ, శత్రువుకి, మిత్రుడికి,సన్నిహితుడికి, వేలమైళ్ల దూరంలో ఉన్నవారికి ఈ ఆవాహనే కలుగుతోంది. నా, నీ, అతని, ఆమె, సమస్త సమాజానికి ఓ కవిని ఏది ఆవహించిందో అదే అందరిని వెంటాడుతోందని చెప్పడమే కవి చేసేపని. చేయాల్సినపని. హెచ్చార్కే చేసినపని. పైకి కనిపించదేమో కాని ఇది ఓ ఆలంబన. ఓ ఆత్మీయ సహానుభూతి. అవును, అతను కూడా నాలాగే ఉన్నాడు…. నే పడుతున్న వేదన, నే అనుభవిస్తున్న ఆనందం, దు:ఖం, సుఖం, విషాదం అన్నీ సార్వజనీనం అనుకుని తాను ఒంటరిని కాననే భరోసా కల్పించుకోవడమే కవి చేయాల్సిన పని. ఇలా బతుకు మీద భరోసాను కల్పించాల్సింది కవులే కదా… కవితో ఓ సాయంత్రం హెచ్చార్కె ఆ పనే చేశాడు. బతుకుమీద ఓ ఆశను రేకెత్తించాడు. సృజనకారుడు ఇదే చేయాలి. హెచ్చార్కే అంగీకరించకపోయినా మహాకవి శ్రీశ్రీ ఇదే చేశాడు. రా.వి.శాస్త్రి ఇలాగే బతికాడు. చుట్ట తిప్పుకుంటూ ఎనభై ఏళ్లు జీవించిన చా.సో కూడా ఇలాగే బతికాడు. టాల్‌స్టాయి, మాక్సిమ్‌ గోర్కీ, చింగీజ్‌ ఐత్‌ మాతోవ్‌, గూగీ వాథియోంగి, మహాశ్వేతాదేవి, రవీంద్రనాద్‌ ఠాగూర్‌, అబ్దుల్‌ కలాం, ఆధ్యాత్మిక గురువులు చంద్రశేఖర మహా భారతి, దలైలామా వీళ్లంతా చెప్పిందీ కలలు కనమనే. కలలు కనలేని జాతి నిర్వీర్యమైపోతుందనే. అన్నట్లు కాకినాడలోనే కాదు… కెనడాలోనైనా కవితో ఓ సాయంత్రం గడిపితే ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉండాలి.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img