Friday, April 26, 2024
Friday, April 26, 2024

సెబి జాప్యపు ఎత్తుగడలు

కె.రవీంద్రన్‌

స్టాక్‌మార్కెట్‌లో షేర్లను తిమ్మినిబమ్మిని చేసి కుంభకోణానికి పాల్పడిన అదానీ గ్రూపు కంపెనీలపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సెబి జాప్యపు ఎత్తుగడలు వేస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదానీ గ్రూపు కంపెనీల మోసాలను హిండెన్‌బర్గ్‌ సంస్థ బైటపెట్టింది. దీనిపై దర్యాప్తు చేయవలసిందిగా షేర్‌మార్కెట్‌ను క్రమబద్దంచేసే సెబీని ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలలో షేర్లకు సంబంధించి అదానీ గ్రూపు కంపెనీలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అదానీ గ్రూపు కంపెనీల వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని బైటపెట్టడంతో కంపెనీలు విఫలమయ్యాయి. స్టాక్‌మార్కెట్‌ షేర్లను అసలు ధరకంటే ఎక్కువగా చూపి ప్రజలకు అమ్మి అపారలాభాలు పొందినట్లు హిండెన్‌బర్గ్‌ నివేదిక తెలియజేసింది. బహుశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహిత స్నేహితుడు అయినందువల్లే అదానీపై సెబి దర్యాప్తు చేయకుండా జాప్యం చేస్తోందని భావిస్తున్నారు. దర్యాప్తు పూర్తిచేయడానికి మే 2వ తేదీ సుప్రీంకోర్టు గడువు విధించింది.
షేర్‌ మార్కెట్‌ను క్రమబద్దం చేస్తున్న సెబి అన్ని కంపెనీల వ్యవహారాలను ఎల్లవేళలా పరిశీలిస్తూనే ఉంటుంది. అలాంటిది నెలలు గడచినాకూడా దర్యాప్తును పూర్తిచేయకపోవడంలో ఔచిత్యం ఏమీలేదు.
దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 6నెలలు గడువు కావాలని సెబి ఏప్రిల్‌ 29న సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసింది. అమెరికా నుండి పనిచేసే హిండెన్‌బర్గ్‌ నివేదికను నమ్మడానికి తాము సిద్దంగాలేమని బీజేపీ నాయకులు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు పూర్తిచేసి నివేదికను సుప్రీంకోర్టుకు అందచేస్తే అసలు విషయం బైటపడుతుంది. అదానీని నిందితుడిగా నివేదిక తెలియజేసినట్లయితే మోదీ ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. అదానీ కుంభకోణానికి పాల్పడినట్లు నిరూపణ జరిగితే, మోదీ ప్రతిష్ట తప్పనిసరిగా దెబ్బతింటుంది. మరో 6నెలలు గడువు కావాలని కోరిన సెబి విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌, న్యాయమూర్తులు పిఎస్‌ నరసింహ, జెపి పర్దివాలాలతో కూడిన ధర్మాసనం మరోమూడు నెలలు గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తుకోసం సుప్రీంకోర్టు ప్రకటించిన నిపుణుల కమిటీ ఇప్పటికే తన నివేదికను అందించింది. పదవీ విరమణచేసిన జడ్జి మనోహర్‌ సప్రి అధ్యక్షతన ప్రముఖ బ్యాంకర్లు కెవి కామత్‌, ఓపి భట్‌, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జెపి దేవధర్‌, న్యాయవాది సోమశేఖర్‌ సుందరేశన్‌లతో కూడిన నిపుణుల కమిటీ దర్యాప్తు చేసింది. ఈ నివేదిక సారాంశం కూడా క్లుప్తంగానే ఉంది.
నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి లావాదేవీలను నివేదించడానికి సెబి అదనపు గడువు కోరడం కేవలం కాలయాపన కోసమే. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై ప్రాథమిక అవగాహన ఏర్పడిరదని మాత్రమే సెబి తెలియజేసింది. స్టాక్‌మార్కెట్లలో షేర్ల ధరను అమాంతంగా పెంచడం ద్వారా ప్రజల దగ్గర అపారంగా లాభాలను పొందిందని హిండెన్‌బర్గ్‌ సమాచారం. అలాగే షేర్లకు సంబంధించిన కనీస నియమ నిబంధనలను కూడా కార్పొరేట్‌ కంపెనీలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక బైటపెట్టకముందు, ఆ తర్వాత కూడా అదానీ గ్రూపు షేర్ల విక్రయం జరిగింది. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) విదేశీ కంపెనీలు నేరుగా పెట్టుబడి పెట్టడంలోనూ(ఓడిఐ) నియమ నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ వాదిస్తూ సెబికి అదనపు గడువు ఇవ్వడం సరైందికాదని అన్నారు. అంతర్జాతీయ సెక్యూరిటీల కమిషన్ల సంస్థలో సభ్యులైన దేశాలనుంచి సమాచారం సెబి తీసుకొని నివేదికను ఇవ్వవచ్చునని అన్నారు. అదానికంపెనీలు అనేక నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా భారతదేశం నుంచి నిధులను మళ్లించినట్లుకూడా ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img