Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు… 115 ఏళ్ల రికార్డు బద్దలు

తెలంగాణ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో లేని విధంగా పల్లెటూళ్ల నుంచి పట్టణాలు, నగరాలను ముంచెత్తు తున్నాయి. జులై నెలలో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోక ముందే సెప్టెంబర్‌ నెలలో మళ్లీ వర్షాలు దంచేస్తున్నాయి. ఈ నేఫథ్యంలోనే భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 24 గంటల్లో 35 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది. ఇది గత 115 ఏళ్లలో మూడో అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 35.1 సెంటీమీటర్లు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది. అలాగే రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3, ఎల్లారెడ్డిపేటలో 19.3 మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో 18, టేక్మాలులో 17.9, కొల్చారంలో 17.6, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో 16.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత పదేళ్లలో సెప్టెంబరు నెలలో 24 గంటల వ్యవధిలో 35.1 సెం.మీ.ల వర్షం కురవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 సెప్టెంబరు 18న నల్గొండలో 21.8 సెం.మీ.లు కురిసినట్లు వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. తెలంగాణలో 1908 నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక వర్షం ఖమ్మం జిల్లా కోహెడలో 1996 జూన్‌ 17న 67.5 సెంటీమీటర్లు కురిసింది. రెండో అత్యధిక రికార్డు 1983 అక్టోబరు 6న నిజామాబాద్‌లో 35.5సెం.మీ.లుగా నమోదైంది. తాజాగా ఆళ్లపల్లిలో నమోదైన 35.1 సెం.మీ.ల వర్షపాతం 115 ఏళ్లలో మూడో అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30గంటల వరకూ 11గంటల వ్యవధిలో జయశంకర్‌ జిల్లా కాటారం లో 10.1, నిర్మల్‌ జిల్లా అబ్దుల్లాపూర్‌లో 8.9 సెం.మీ.ల వర్షం కురిసింది.
రాకపోకలకు అంతరాయం..
భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు సిరిసిల్లలోని పెద్దచెరువు, జంగమయ్యకుంట, శుద్దగండి, కొత్త చెరువులు అలుగు పారాయి. వెంకంపేట, అశోక్‌నగర్‌, అనంతనగర్‌, సంజీవయ్యనగర్‌, శాంతినగర్‌, శ్రీనగర్‌ కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని బతుకమ్మవాగు వంతెనను ఆనుకొని నిర్మించిన అప్రోచ్‌రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో జాతీయ రహదారి-63 మీదుగా మహారాష్ట్రలోని సిరోంచా మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాముత్తారం మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో పత్తి, వరి నీట మునిగాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పెంకవాగు ఉప్పొంగడంతో తిప్పాపురం పెంకవాగు, కొత్తగుంపు, కలిపాక గ్రామాలకు, కంకలవాగు ప్రవాహంతో మల్లాపురం, కర్రెవానిముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img