Friday, April 26, 2024
Friday, April 26, 2024

మునుగోడును దత్తత తీసుకుంటా : మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసన్నారు. 2006లో 32 మండలాలు తిరుగుతూ.. ఆయన స్వయంగా పాట రాశారన్నారు. చూడు చూడు నల్లగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్‌ బండ అని పాట రాసిండు అన్నారు. శివన్నగూడెంలో నిద్రించి నాడు ఒక మాట ఇచ్చారు.. తాగునీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి అయిండు.. ఏ ఒక్కరూ కూడా మంచి చేయలేదు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. నల్లగొండ జిల్లాకు అనుకొని కృష్ణా నది వెళ్తున్నప్పటికీ, తాగు, సాగునీటి సమస్య పరిష్కరించలేదన్నరు. రిజర్వాయర్లు కట్టలేదు.. తాగునీరు ఇవ్వలేదు.. ఇవాళ కేసీఆర్‌ ప్రభుత్వంలో చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్‌ కట్టి నీరు ఇవ్వబోతున్నామన్నారు. లక్ష్మణపల్లి రిజర్వాయర్‌ చేపట్టాం.. చెరువులను నింపుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నవంబర్‌ 6 తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానన్నారు. అభివృద్ధిలో అండగా ఉంటానన్నారు. రోడ్లను అభివృద్ధి చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచండి. తప్పకుండా అభివృద్ధిలో పయనిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేద్దామని కేటీఆర్‌ పేర్కొన్నారు. లక్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img