Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

దిశ మార్చుకున్న అసని

కొనసాగుతున్న తీవ్ర తుపాను
నేటి సాయంత్రంలోగా మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకే అవకాశం
అల్లకల్లోలంగా సముద్రం… అనేక చోట్ల భారీ వర్షాలు
ఈదురు గాలులతో నేలమట్టమైన పంటలు
మత్స్యకారులను హెచ్చరించిన అధికారులు
కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: అసని తుపాను తీవ్ర అలజడి సృష్టిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. భీమిలి మండలం మంగళ వారి పేట, జోడి గొల్లపాలెం వద్ద సముద్రం 10 అడుగులు ముందుకు వచ్చిందని స్థానికులంతా ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలయింది. బలమైన ఈదురు గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా-ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ కృష్ణాజిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రం లోపు మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అధికారులు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఉంటుందని, రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. నల్గొండ, ఖమ్మం , సూర్యాపేట, కొత్తగూడెం, భద్రాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాలను ఖాళీ చెయ్యాలని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 48 నుంచి 63 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అనుకున్నదాని కంటే తీరానికి దగ్గరగా తుపాను వచ్చిందని, తీరం వెంబడే ఉత్తర దిశగా ప్రయాణించి సముద్రంలోనే ఆగిపోనున్న అసని తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుపానుకి అక్కడక్కడ ఉన్న మామిడి పంట కూడా దెబ్బతిని, కాయలన్నీ నేలపాలయ్యాయి. అరటి, చెరకు, మొక్కజొన్న , పామాయిల్‌ వంటి వాణిజ్య పంటలన్నీ ధాటికి దాటికి నేలమట్టమయ్యాయి. అనేక చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో తుపాను తీవ్రత మరింత అధికంగా కనిపించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ తీరప్రాంతాల్లో అసని తుపాను తీవ్ర అలజడి రేపింది. కాగా మంగళవారం ఉదయం నుంచి వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయి. అటు భీమిలి నుంచి ఇటు ఫిషింగ్‌ హార్బర్‌ వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సముద్రం ముందుకు వస్తోంది. మత్స్యకారులు ముందు జాగ్రత్తగా తీరంలో లంగరు వేసిన బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెప్పలపై వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ రెండు రోజులు ఇళ్లవద్దనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈదురు గాలులకు రుషికొండ ఐటీ పార్కులోని కొన్ని సంస్థల్లో రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది.
రద్దయిన విమాన సర్వీసులు
మరోపక్క అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను ముందుగానే రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఎయిర్‌ ఏషియాకి చెందిన దిల్లీవిశాఖ, బెంగళూరు-విశాఖ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన రాయపూర్‌- విశాఖ, దిల్లీవిశాఖ, ముంబై ప్రాంతాలకు వెళ్లే విమానాలను తుపాను కారణంగా తీవ్ర గాలులు నేపథ్యంలో తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.
ఇంటర్‌ పరీక్ష వాయిదా
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరగాల్సిన ఇంటర్‌ పరీక్ష వాయిదా పడిరది. దీనిని ఈ నెల 25న నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటన చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img