Friday, April 26, 2024
Friday, April 26, 2024

జవాను-మోదీ-దేవుడు

పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ప్రజలు ఎదుర్కుంటున్న అనేకానేక సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడు సంవత్సరాలుగా ఏం చేసినా చేయకపోయినా క్రమం తప్ప కుండా దీపావళి రోజున సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లను పరామర్శిస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుని తీసుకునే చర్య లేమిటో ఇంతవరకు తెలియలేదు. కానీ పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా మన ఆయుధ సంపత్తి పెంచుకోవలసిన అగత్యం ఉందని మాత్రం మరిచి పోకుండా చెప్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరవాత ప్రధానమంత్రి కేదార్‌ నాథ్‌ వెళ్లడం ఇది అయిదో సారి. ఎన్నికలు వచ్చినా, రాజకీయాలకోసమైనా ప్రధానికి జవాన్లు, భగవంతుడు తప్పని సరిగా గుర్తొస్తుంటారు. నరేంద్ర మోదీ కేదార్‌ నాథ్‌ సందర్శించడం ప్రధానమంత్రి అయినప్పుడే ప్రారంభం కాలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పుడు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు కార్యకర్తగా పని చేస్తున్నప్పుడూ ఆయన కేదార్‌ నాథ్‌ వెళ్తూనే ఉన్నారు. 1980లలో ఒకసారి ఆయన కేదార్‌నాథ్‌ వెళ్లి దాదాపు నెలన్నర ఒక గుహలో ధ్యానంలో నిమగ్నమయ్యారు. మొన్నా మధ్య కూడా ఆయన ధ్యానంలో నిమగ్నమైన ఫొటోలు చూశాం. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి. చేయవలసిన పనులు, తీర్చవలసిన కష్టాలు నిరంతరం చుట్టుముడ్తూనే ఉన్నాయి. వీటి పరిష్కారం కేదార్‌ నాథ్‌ ధ్యానం వల్ల పరిష్కారం అయిన దాఖలాలైతే లేవు. 2017లో ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసి, బీజేపీ ఘన విజయం సాధించిన తరవాత కూడా ఆయన కేదార్‌ నాథ్‌ వెళ్లొచ్చారు. 2014లో ఆయన సియాచిన్‌లో సరిహద్దు ప్రాంతాలు సందర్శించి వచ్చారు. 2015లో అమృత్సర్‌ సమీపంలోని వాఘా సరిహద్దు ప్రాంతంలో దీపావళి రోజు సైనికులతో పాటు గడిపారు. 2016లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐ.టి.బి.పి. శిబిరంలో, అంటే చైనా సరిహద్దులో గడిపారు. 2017లో దీపావళి రోజున కశ్మీర్‌లోని గురేలో ఉన్నారు. 2018లో మళ్లీ చైనా సరిహద్దులోని ఐ.టి.బి.పి. శిబిరాన్ని సందర్శించారు. 2019లో కశ్మీర్‌లోని భారత్‌ పాకిస్తాన్‌ పొలిమేరల్లోని రాజౌరీలో దీపావళి రోజున ఉన్నారు. 2020లో ఎడారి ప్రాంతమైన సరిహద్దులోని జైసల్మేర్‌ వెళ్లారు. అంటే తూర్పు నుంచి పశ్చిమం దాకా సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించడం ఆయన పనిగా పెట్టుకున్నారనిపిస్తోంది. 2021లో నౌషెరాలో సైనికులకు మిఠాయిలు పంచారు. ప్రధాని సరిహద్దుల్లో ఉన్నప్పుడు సైనిక దుస్తుల్లో కనిపిస్తారు. ప్రధాని సరిహద్దు ప్రాంతాల పర్యటనవల్ల దేశ భద్రత సురక్షితంగా ఉందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేం. పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని ఎగసనదోయడం ఆపనే లేదు. చైనా కవ్వించడం మాననే లేదు. పదకొండు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం కొనసాగిస్తున్న రైతుల సమస్యను పట్టించుకోవడానికి గానీ, ఈ ఉద్యమం క్రమంలో వివిధ కారణాలవల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కానీ మోదీకి తీరికే చిక్కలేదు. జనవరి 22 తరవాత ప్రభుత్వం ఉద్యమిస్తున్న రైతుల ఊసే ఎత్తలేదు.
ప్రభుత్వాధినేత పూజల వల్ల నిరుద్యోగం, పేదరికం ఇసుమంతైనా తగ్గుముఖం పట్టిన దాఖలాలు అయితే లేవు. పేదలకు దక్కిందల్లా కరోనా కారణంగా అయిదు కిలోల ఉచిత ఆహార ధాన్యాలు మాత్రమే. కరోనా సమయంలో లక్షల మంది వలస కార్మికులు కాళ్లు బొబ్బలెక్కేట్టు కాలి నడకన వేలాది కిలోమీటర్లు నడిచి వెళ్లారు. వీరి లెక్కలు తమ దగ్గర లేవని ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా నిర్మొహమాటంగా చెప్పేసింది కనక వారిని ఆదుకున్నారని అనుకోడానికీ వీలు లేదు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కరోనా సమయంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. వీరిని గట్టెక్కించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్దిష్ట చర్యా లేదు. కానీ కరోనా సమయంలోనే అంబానీల, ఆదానీల ఆదాయం రెట్టింపు అయింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించినందువల్ల ఆ సంస్థల ఖాతాల్లో చూపించే నష్టాలు పూడితే పూడి ఉండవచ్చు. కానీ పన్నుల్లో రాయితీల వల్ల ఉపాధి అవకాశాలు మాత్రం పెరగలేదు. పైగా ఉత్పత్తి మందగించడమే కాక ప్రతికూల పరిస్థితికి చేరింది. జనం కొనుగోలు శక్తి తగ్గిన స్థితిలో కూడా కార్పొరేట్‌ సంస్థల లాభాలు మాత్రం పెరిగాయి. ఇదీ మన ఆర్థిక వ్యవస్థ విలోమ ముఖ చిత్రం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో అస్సాంలో మినహా మిగతా అనేక రాష్ట్రాలలో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలిన తరవాత ఏదో కరుణించినట్టు పెట్రోల్‌, డీసెల్‌ ధరలు పది పన్నెండు రూపాయలు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో అన్ని దేశాల వారికీ ముడి చమురు బ్యారెల్‌కు 25 డాలర్లకే దొరుకుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీ పడి పన్నులు వడ్డించడం వల్ల పెట్రోల్‌, డీసెల్‌ ధరలు మన దేశంలో తడిసి మోపెడవుతున్నాయి. ఇంత అద్వాన స్థితి మరెక్కడా లేదు. ఇటీవల ప్రధానమంత్రి విదేశీ యాత్రలు తగ్గాయి. 2012-13లో అయితే ప్రధాన మంత్రి ప్రతి పన్నెండు రోజులకు ఒక రోజు ఏదో ఒక విదేశీ యాత్రలోనే ఉండేవారు. ఇటీవలే జి-20 దేశాల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ఇతర దేశాధినేతలతో ఆలింగనాలు, కరచాలనాలు చిత్రాల రూపంలో చూశాం. కానీ జి-20 దేశాల్లోకెల్లా అత్యంత పేద దేశం మనదేనన్న వాస్తవం బయటపెట్టిన వార్త ఒక్కటీ కనిపించలేదు. మన పరిస్థితి దుర్బలంగా ఉందనిపించినప్పుడల్లా ప్రధాని సరిహద్దులో జవాన్ల దగ్గరకు వెళ్లి నూతనోత్తేజితులవుతున్నారేమో. దేశ వాసుల సంక్షేమం కోసం కేదార్‌ నాథ్‌లో ధ్యాన నిమగ్నులవుతున్నారేమో. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, ఉత్తరా ఖండ్‌, పంజాబ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి కనక దేశవాసుల్లో దేశభక్తిని రగుల్కొలపడానికి సైనిక దుస్తుల్లో దర్శనమిస్తున్నారేమో. కేదార్‌ నాథ్‌లో దేశ సంక్షేమం కోసం పూజాదికాలు చేస్తున్నారేమో. వెళ్లినప్పుడల్లా మోదీ ఆ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల పథకాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆ పథకాల అమలులో సాధించిన ప్రగతి ఏమిటో ఎవరూ బయట పెట్టరు. ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఉదాహరణ ప్రాయంగా చూసినా విద్యా రంగానికి కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం అందించలేక పోతోంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (మామూలు భాషలో విద్యా శాఖ) కు బడ్జెట్‌లో కేటాయించిన నిధులైనా అందించే స్థితిలో ప్రభుత్వం లేదన్నది వాస్తవం. ధరల పెరుగుదల, ఉపాధి కొరత, నిరుద్యోగం నానాటికీ తీవ్రమవుతున్నాయి. అంత్యోదయ గురించి ప్రస్తుత బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు నాయకుడు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పదే పదే ప్రస్తావించేవారు. ఆయన సిద్ధాంతమే మోదీ ప్రభుత్వానికి ఆదర్శం అనుకుంటే దరిద్ర నారాయణుడి పరిస్థితి ఎందుకు మెరుగవడం లేదు అన్న ప్రశ్నకు సమాధానమే లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img